ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రభుత్వ పనితీరుని ఏవిధంగా మారుస్తుందంటే?

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:26 AM

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రభుత్వ పనితీరుని ఏవిధంగా మారుస్తుందంటే?

కొద్దిరోజులలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఎన్నికల తేదీ ప్రక్కటించిన నాటి నుండి లెక్కింపు పూర్తయ్యి ఫలితాలు వెలువడే వరకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లో ఉంటుంది.
తాజాగా లోక్ సభ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 16వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ నియమావళి ప్రభుత్వ సాధారణ పనితీరును గణనీయంగా మారుస్తుంది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి?
స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం, తనకు రాజ్యాంగం ద్వారా లభించిన అధికారంతో, ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) ని ప్రకటిస్తుంది. ఈ నియమావళిని ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పక్షాలకు, అందరు అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో సమాన విజయావకాశాలు (level playing field) ఉండాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)ని రూపొందించారు.

ఎంసీసీ అమలుతో ఎలాంటి మార్పులు వస్తాయి?
* లోక్ సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఏ విధమైన ప్రాజెక్టులు, పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు.
* ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత మంత్రులు, ఇతర అధికారులు ఎటువంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం లేదా హామీలు ఇవ్వడం నిషిద్ధం.
* అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ లేదా పబ్లిక్ అండర్ టేకింగ్ లలో తాత్కాలిక నియామకాలు నిషిద్ధం.
* రోడ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం వంటి హామీలను ఈ కాలంలో అనుమతించరు.
* లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత మంత్రులు, ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు, చెల్లింపులు మంజూరు చేయలేరు.

ప్రభుత్వ వనరుల వినియోగం:
* ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత, అధికారిక పర్యటనలను ఎన్నికల పనులతో కలపరాదు. ఎన్నికల ప్రచారం కోసం అధికారిక యంత్రాంగాన్ని లేదా సిబ్బందిని ఉపయోగించరాదు.
* విశ్రాంతి గృహాలు, డాక్ బంగ్లాలు లేదా ఇతర ప్రభుత్వ వసతి గృహాలను అధికార పార్టీ లేదా దాని అభ్యర్థులు గుత్తాధిపత్యం చేయకూడదు. కానీ వాటిని ప్రచార కార్యాలయాలుగా ఉపయోగించడం లేదా వాటిలో ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలు నిర్వహించడం కుదరదు.
* ఎన్నికల సభలు నిర్వహించడానికి మెయిడెన్లు, విమాన సర్వీసుల కోసం హెలిప్యాడ్లు వంటి బహిరంగ ప్రదేశాలు అన్ని పార్టీలు, అభ్యర్థులకు ఒకే షరతులతో అందుబాటులో ఉండాలి.
* అధికారిక విమానాలు, వాహనాలు, యంత్రాలు, సిబ్బందితో సహా ప్రభుత్వ రవాణాను ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.


పక్షపాత కవరేజీని నివారించడం:

* ఎన్నికల సమయంలో వార్తాపత్రికలు, ఇతర మాధ్యమాల్లో ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనలను జారీ చేయడంపై నిషేధం ఉంది. రాజకీయ వార్తలను పక్షపాతంగా కవరేజ్ చేయడానికి అధికారిక మాస్ మీడియాను దుర్వినియోగం చేయడం, అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం నిషేధం.

ఒక పార్టీ లేదా అభ్యర్థి ఎంసీసీని ఉల్లంఘిస్తే?
ఎంసీసీకి సొంతంగా చట్టబద్ధత లేదు. అయితే, 1860 నాటి భారతీయ శిక్షా స్మృతి, 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంతో సహా ఇతర చట్టాలలో సంబంధిత క్లాజుల ద్వారా దానిలోని నిర్దిష్ట నిబంధనలు అమలు చేస్తారు. 1968 ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వుల్లోని పేరా 16ఏ ప్రకారం పార్టీ గుర్తింపును సస్పెండ్ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఈసీఐకి అధికారం ఉంది.





Untitled Document
Advertisements