ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్.. స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర‌పై సంచ‌ల‌న విష‌యాలు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 05:16 PM

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్.. స్కామ్ లో  కేజ్రీవాల్ పాత్ర‌పై సంచ‌ల‌న విష‌యాలు

ప్రస్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ
ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. లిక్క‌ర్ స్కామ్ కేసులో సరైన వివరాలు రాబట్టేందుకు, పూర్తి స్తాయి విచారణ చేపట్టేందుకు, ఆయనను ప్ర‌శ్నించేందుకు కేజ్రీవాల్‌ను 10 రోజుల‌పాటు క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని న్యాయ‌స్థానానికి మొద‌ట ఈడీ కోరింది. ఈ సంద‌ర్భంగా అన్ని నిబంధ‌న‌లు పాటించి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన ఆధారాల‌ను 28 పేజీల్లో రాత‌పూర్వకంగా అంద‌జేసిన‌ట్లు వివ‌రించారు. అరెస్టు పంచ‌నామా కూడా త‌మ వ‌ద్ద ఉంద‌ని ఈడీ త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలియ‌జేశారు.

అలాగే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క‌మైన వ్య‌క్తి అని, కొంద‌రు వ్య‌క్తుల‌కు మేలు చేసేందుకు డ‌బ్బులు (లంచం) అడిగార‌ని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్ల‌డించింది. అక్ర‌మ మార్గంలో వ‌చ్చిన ఈ నగ‌దును గోవా ఎన్నిక‌ల్లో ఆప్ ఉపయోగించింద‌ని తెలిపింది. లిక్క‌ర్ పాల‌సీ రూపక‌ల్ప‌న‌లో కేజ్రీవాల్‌కు ప్ర‌త్య‌క్ష పాత్ర ఉంద‌ని, ఈ కుంభ‌కోణంలో ప్ర‌ధాన వ్య‌క్తి ఆయ‌నేన‌ని తెలియ‌జేసింది.

ఇక ఈ కేసులో స‌హ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామ‌ని కోర్టు ఈడీ తెలిపింది. ఆప్ మాజీ క‌మ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజ‌య్ నాయ‌ర్ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వ‌ద్ద ప‌నిచేస్తున్నార‌ని, కేజ్రీవాల్‌తో చాలా స‌న్నిహితంగా ఉండే విజయ్ నాయ‌ర్ మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్నాడ‌ని ఈడీ పేర్కొంది.

సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డ‌బ్బు డిమాండ్ చేశార‌ని, ఈ విష‌యాన్ని నిరూపించ‌డానికి త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని ఈడీ త‌రఫు న్యాయ‌వాదులు కోర్టుకు తెలియ‌జేశారు. రెండు ప‌ర్యాయాలు న‌గ‌దు బ‌దిలీ జ‌రిగింద‌ని వివ‌రించారు. సౌత్ గ్రూప్‌కు మ‌ద్యం పాల‌సీ ల‌బ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నార‌ని తెలిపారు. లిక్క‌ర్ పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా ఎమ్మెల్సీ క‌వితను కేజ్రీవాల్ క‌లిశార‌ని, క‌లిసి ప‌నిచేద్దామ‌ని ఆమెతో కేజ్రీవాల్ చెప్పార‌ని ఈడీ తెలిపింది.

విజ‌య్ నాయ‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ కోసం ప‌నిచేశార‌ని, గోవా ఎన్నిక‌ల స‌మ‌యంలో రూ.45 కోట్లు చేతులు మారాయ‌ని కోర్టుకు ఈడీ త‌రఫు న్యాయ‌వాదులు వెల్ల‌డించారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఆధారాల‌లో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయ‌ని న్యాయ‌స్థానికి ఈడీ తెలిపింది. విజ‌య్ నాయ‌ర్‌కు సంబంధించిన సంస్థ నుంచి ఆధారాలను సేక‌రించిన‌ట్లు వివ‌రించింది. ఇందులో భాగంగా రూ.45 కోట్లు హ‌వాలా మార్గంలో త‌ర‌లించిన‌ట్టు తేలింద‌ని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్య‌క్తుల ద్వారా చేతులు మారాయ‌ని వివ‌రించింది. ప్ర‌స్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో ఇంకా వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. మరి ఈడీకి క్రేజీవాల్ కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి ఇస్తుందో లేదో, ఇస్తే ఎన్నిరోజులు ఇస్తుంది అనేది చూడాలి.





Untitled Document
Advertisements