మృత సముద్రం మృత్యువాత పడనుందా..!

     Written by : smtv Desk | Fri, Feb 23, 2018, 04:06 PM

మృత సముద్రం మృత్యువాత పడనుందా..!

జోర్డాన్, ఫిబ్రవరి 23 : 'డెడ్ సీ' మృత సముద్రం ఈ పేరు తెలియని వారంటూ ఉండరు.. ఎవరినైనా పిల్లలను అడిగితే ఇజ్రాయెల్‌, పాలస్థీనా జోర్డాన్‌ల మధ్య ఉంటుందని జవాబు చెబుతారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ 'డెడ్ సీ' ప్రస్తుతం అంతరించే దశలో ఉండటంతో పర్యాటకులు, శాస్త్రవేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో ఎన్నో విచిత్రలకు, విశిష్టతలకు పేరుగాంచిన ఈ సముద్రం ఏడాదికి ఒక మీటరు తగ్గుతుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుత ఈ పరిస్థితికి కారణం మానవా తప్పిదమేనని తెలుస్తోంది.

పేరులో సముద్రం అని ఉన్నా వాస్తవానికి ‘డెడ్‌ సీ’ 50 కి.మీ. పొడవు, 15 కి.మీ వెడల్పుతో విస్తరించిన ఒక పెద్ద సరస్సు లాంటిది. ఈ మృత సముద్రంలోకి జోర్డాన్‌ నది నుంచి నీళ్లు వచ్చి చేరుతుంటాయి. అక్కడక్కడ మరికొన్ని చిన్నచిన్న సెలయేళ్ల నుంచీ నీరు ఇందులో కలుస్తాయి. కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌, పాలస్థీనా ప్రజలు తాగు నీటి కోసం జోర్డన్‌ నది నుంచి భారీగా పైపులైన్లు వేసుకుని నీటిని తోడేసుకుంటూ ఉండటంతో ఈ సముద్రంలోకి నీటిప్రవాహం తగ్గిపోయింది. మరోవైపు ఈ నీళ్లలో ఉండే ఖనిజాలు, లవణాలు, వీటికి ఉన్న ప్రత్యేకతల రీత్యా దీన్ని పెద్దఎత్తున సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.

ఇంకోవైపు సముద్ర తీరంలో ఎండిపోయిన తర్వాత గాఢమైన ఉప్పు మిగులుతోంది. దీంతో నేల ఉన్నట్టుండి పెద్దపెట్టున కుంగిపోయి, పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. వీటినే ‘సింక్‌ హోల్స్‌’ అంటారు. సముద్రం కుంచించుకుపోవటంలో ఈ ‘సింక్‌ హోల్స్‌’ పాత్ర కుడా ఉందని శాస్త్రవేతలు అభిప్రాయపడుతున్నారు. మృత సముద్రం గత కొన్నేళ్లలో 80 అడుగుల మేర ఎండిపోయింది. ఇదే ప్రక్రియ ఇలానే కొనసాగితే మృత సముద్రం చరిత్రలో ఉండేది అని చెప్పుకొనే పరిస్థితి రావడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements