ఎస్‌.ఎం. కృష్ణ సొంత గూటికి రానున్నారా..!

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 06:33 PM

 ఎస్‌.ఎం. కృష్ణ సొంత గూటికి రానున్నారా..!

బెంగళూరు, ఏప్రిల్ 10 : కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళా ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. పార్టీ అధినేతలతో రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి.

హస్తం పార్టీ నుంచి అనేక సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే రాహుల్‌ గాంధీ పార్టీలోని సీనియర్‌ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని భావించిన కృష్ణ గతేడాది బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కూతురు శాంభవి రాజరాజేశ్వరనగర అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఆశించారని, బీజేపీ ఇందుకు నిరాకరించడంతో కృష్ణ పార్టీని వీడేందేందుకు సిద్ధపడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మానసికంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తి అయిన కృష్ణ కాషాయ పార్టీలో ఉండలేకపోతున్నారని, తనకు తగిన ప్రాధాన్యం లభించడంలేదని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఎస్‌.ఎం. కృష్ణ వ్యక్తిగత సిబ్బందిని అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు.





Untitled Document
Advertisements