సీజేఐ 'సమానులలో ప్రథములు' : సుప్రీం

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 12:44 PM

 సీజేఐ 'సమానులలో ప్రథములు' : సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 : భారత ప్రధాన న్యాయమూర్తి సమానులలో ప్రథములని, కేసులను కేటాయించడం, బెంచ్‌లను ఏర్పాటుచేయడంపై నిర్ణయం తీసుకునే హక్కు సీజేఐ ( భారత ప్రధాన న్యాయమూర్తి) కు ఉంటుందని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసుల కేటాయింపులు, ధర్మాసనాల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ అశోక్‌ పాండే అనే వ్యక్తి ఇటీవల ప్రజా ప్రయోజ వ్యాజ్యాన్ని(పీఐఎల్)దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ వాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం..‘సుప్రీంకోర్టు వ్యవహారాల్లో సీజేఐదే అంతిమ నిర్ణయం అని రాజ్యాంగంలో ఉంది. పారదర్శక పనితీరు కోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయన బాధ్యతలపై అవిశ్వాసం తగదు. ఈ పిటిషన్‌ సీజేఐ పదవికి అపకీర్తి తెచ్చేలా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.

కాగా ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టులో పరిపాలన వ్యవస్థ సరిగా లేదని నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జస్టిస్‌ జాస్తి ఛలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లు మీడియా సమావేశం ఏర్పాటుచేసి సీజేఐపై అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.





Untitled Document
Advertisements