వర్తకులు ఆగ్రహానికి గురైన అమితాబ్.. ఫ్లిప్ కార్ట్ ప్రకటనే కారణం

     Written by : smtv Desk | Thu, Oct 05, 2023, 12:25 PM

వర్తకులు ఆగ్రహానికి గురైన అమితాబ్.. ఫ్లిప్ కార్ట్ ప్రకటనే కారణం

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏటా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించడం అందరికీ తెలుసు. ఎప్పట్లాగే ఈ ఏడాది కుడా ఈ నెల 8 నుంచి 15 వరకు బిగ్ బిలియన్ డేస్ పేరుతో భారీ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది
నిర్వహిస్తున్న సేల్ కారణంగా అనూహ్య రీతిలో అమితాబచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. సేల్ కు సంబంధించి అమితాబచ్చన్ తో ఓ ప్రకటనను ఫ్లిప్ కార్ట్ విడుదల చేసింది. దీనిపై అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల పరిరక్షణ విభాగానికి (సీసీపీఏ) లేఖ రాసింది.
ఫ్లిప్ కార్ట్ ప్రకటన తప్పుదోవ పట్టించేదిగా, దేశంలో చిన్న వర్తకులకు వ్యతిరేకంగా ఉందన్నది సీఏఐటీ ఆరోపణ. ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఫ్లిప్ కార్ట్ పై జరిమానా విధించాలని, ప్రకటనలో నటించిన అమితాబచ్చన్ కు రూ.10 లక్షల జరిమానా విధించాలని డిమాండ్ చేసింది.

‘‘చట్టంలోని సెక్షన్ 2(47) కింద పేర్కొన్న నిర్వచనం ప్రకారం.. భారత మార్కెట్లో విక్రయదారులు, సరఫరాదారులు మొబైల్ ఫోన్లను ఏ ధరలకు అందుబాటులో ఉంచుతున్నారనే విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే మాదిరిగా ఫ్లిప్ కార్ట్ వ్యవహరించింది. ఇది స్పష్టంగా మరో వ్యక్తి విక్రయించే వస్తు, సేవలను కించపరిచే విధంగా ఉంది’’అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ కండేల్వాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.






Untitled Document
Advertisements