పూర్తయిన హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ పనులు.. ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని

     Written by : smtv Desk | Mon, Feb 12, 2024, 10:38 AM

పూర్తయిన హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ పనులు..  ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని

సనత్‌నగర్- మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను రెడీ అయ్యింది. కొంతకాలం క్రితం ప్రారంభమైన హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం మొదలుకుని విద్యుద్దీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు.

మార్చి మొదటి వారంలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. అదే రోజున సనత్ నగర్-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-ఘట్కేసర్ లైను కూడా ఆదే రోజు ప్రారంభం కావొచ్చు.

తీరనున్న టెకీల కష్టాలు..
మాల్కాజిగిరి, ఆల్వాల్ ప్రాంతాలకు చెందిన టెకీల కష్టాలు ఎమ్ఎమ్‌టీఎస్ రాకతో తీరనున్నాయి. ఎమ్ఎమ్‌‌టీఎస్ మౌలాలి- సనత్‌నగర్, హైటెక్‌సిటీ మీదుగా అందుబాటులోకి రావడంతో వీరంతా సులువుగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులు 25 వేల నుంచి 30 వేల మంది నివాసముంటున్నారని సంక్షేమ సంఘాల వారు తెలిపారు.

రద్దీగా ఉండే సికింద్రాబాద్‌తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్ సిటీకి ఎమ్ఎమ్‌టీఎస్ సర్వీసు అందుబాటులోకి రానుంది. దీంతో, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్ సిటీ వైపు ప్రయాణకష్టాలు తీరుతాయి. మౌలాలి-సనత్ నగర్ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో, ఆయా స్టేషన్ల పరిధిలోని కాలనీలు, బస్తీలకు వేగవంతమైన ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి వచ్చినట్టువుతుంది.





Untitled Document
Advertisements