మీ ఐఫోన్ పోతే దానికి ఆపిల్ బాధ్యత వహించదు.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

     Written by : smtv Desk | Thu, Feb 22, 2024, 08:56 AM

మీ ఐఫోన్ పోతే దానికి ఆపిల్ బాధ్యత వహించదు.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

ఐఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అంత ఖరీదైన ఫోన్ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఐఫోన్ ఇన్సూరెన్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తికి చెందిన ఐఫోన్ పోతే దాన్ని ఎక్కడుందో వెతికిపట్టుకునే బాధ్యత ఆపిల్ ది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐఫోన్ పోగొట్టుకున్నవారే బాధ్యత వహించాలని ఓ కేసులో తీర్పు ఇచ్చింది.

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఫోన్ కొనే సమయంలోనే థెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు. అయితే, అతడి ఐఫోన్ పోవడంతో పోలీసులు, ఆపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు.

ఐఎంఈఐ నెంబరు ఆధారంగా ఆపిల్ తన ఫోన్ ను వెతికి పట్టుకుంటుందని ఆ వ్యక్తి ఆశించాడు. కానీ, ఆపిల్ ఆ పని తనది కాదని ఐఫోన్ జాడ తెలుసుకునేందుకు నిరాకరించింది. దాంతో అతడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆ ఫోన్ ను వెతికే బాధ్యత ఆపిల్ దేనని పేర్కొంది. దీనిపై ఆపిల్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఐఫోన్ పొగొట్టుకున్నవారే బాధ్యత వహించాలని, పోయిన ఫోన్ కు ఆపిల్ సంస్థ బాధ్యత వహించదని తన తీర్పులో వెల్లడించింది. చోరీకి గురైన ఫోన్లను వెతికిపట్టుకోవాలని ఆయా మొబైల్ తయారీ సంస్థలను కోరడం సరైనది కాదని, పోగొట్టుకున్న వాటికి ఆయా మొబైల్ తయారీ సంస్థలను బాధ్యులుగా చేయలేమని అభిప్రాయం వ్యక్తం చేసింది.





Untitled Document
Advertisements