ఎర్ర గుడ్లు, తెల్ల గుడ్లు,వీటిలో ఏవి మంచివంటే?

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 11:53 AM

ఎర్ర గుడ్లు, తెల్ల గుడ్లు,వీటిలో ఏవి మంచివంటే?

సాధారణంగా పిల్లలకు డైలీ ఒక ఎగ్ పేట్టండి అంటుంటారు . దీని వలన పిల్లలకు కావలసిన పోషకాలు లభిస్తాయి అని . అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ లో రెండు రకాలైన ఎగ్స్ లభిస్తున్నాయి . దీని వలన అందరికి సమస్య గా మారింది ఏది తింటే మంచిది అని .
చాలా మంది ఎర్ర గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. ఎందుకంటే, అవి ఖరీదెక్కువ కాబట్టి. మరికొందరు అలా కాదని అంటున్నారు.

తెల్ల గుడ్డు మంచిదా, ఎర్ర గుడ్డు మంచిదా అనేది తెలుసుకునే ముందు, ఈ కోడి గుడ్లు రెండు రంగుల్లో ఉండడానికి కారణమేంటో తెలుసుకుందాం.

కోడి జాతి, దాని జన్యు నిర్మాణంపై గుడ్డు రంగు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, తెల్ల రెక్కలున్న కోళ్లు పెట్టే గుడ్లు తెల్లని రంగులో, ముదురు రంగు కోళ్ల గుడ్లు ఎరుపు రంగులో ఉంటాయి.

వైట్ లెఘోర్న్ జాతి కోళ్లు రకరకాల రంగుల్లో ఉన్నప్పటికీ అవి తెల్లటి గుడ్లు పెడతాయి. ప్లైమౌత్ రాక్, రోడ్ ఐలాండ్ జాతుల కోళ్లు ఎర్రని గుడ్లు పెడతాయి. కొన్ని జాతుల కోళ్లు తెల్లగా ఉన్నా ఎరుపు గుడ్లు పెడతాయి.కోడి గర్భాశయంలోని షెల్ గ్రంథులపై గుడ్డు షెల్(పెంకు)కి వచ్చే ముదురు రంగు ఆధారపడి ఉంటుంది.

అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, కోడి లోపల గుడ్డు ఏర్పడడానికి సుమారు 26 గంటల సమయం పడుతుంది. ముందుగా కోడి గర్భంలో గుడ్డు పచ్చసొన ఏర్పడుతుంది.పచ్చసొన చుట్టూ తెల్ల సొన లేదా 'అల్బుమిన్' ఏర్పడడానికి మూడు గంటలు, షెల్ కింద ఉండే పలుచని పొరకి గంటకి పైగా సమయం పడుతుంది.ఆ తర్వాత తోక దగ్గరుండే షెల్ గ్రంథిలోకి గుడ్డు చేరుతుంది. ఇక్కడే గుడ్డుపై ఉండే పెంకు ఏర్పడుతుంది. ఈ షెల్ తయారవడానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది.
గుడ్డు పెంకులన్నీ తొలుత తెల్లగానే ఉంటాయి. గుడ్డు తయారయ్యే చివరి నిమిషంలో రంగు మారుతుంది. కోడి శరీరంలో ఉండే పిగ్మెంట్ నుంచి ఈ రంగు వస్తుంది.



కోళ్ల వయసు లేదా కోళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటి గుడ్ల రంగు మారడం కనిపించినట్లు తెలుస్తుంది . సాధారణంగా, గుడ్లు, మాంసం రెండింటి కోసం పెంచే కోళ్లు ఎరుపు రంగు గుడ్లు పెడతాయి.ఈ కోళ్లు పెద్ద పరిమాణంలో ఉండటంతో వాటికి ఎక్కువ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కోడి గుడ్ల ఉత్పత్తి ఖర్చు ఎక్కువ.

వాటితో పోలిస్తే తెల్లరెక్కల కోళ్ల పెంపకం ఖర్చు కాస్త తక్కువ. అవి ముదురు రంగు కోళ్ల కంటే ఆహారం తక్కువ తీసుకుంటాయి. అందుకే ఎర్ర గుడ్ల కంటే తెల్ల గుడ్ల ధర కాస్త తక్కువగానే ఉంటుంది.దానిని బట్టి రెండు రంగుల గుడ్లలో ఉండే పోషకాలు, వాటి నాణ్యత దాదాపు సమానమేనని చెప్పవచ్చు. కాబట్టి ఏ రంగు గుడ్లను అయినా నిరభ్యంతరంగా తినవచ్చు.అయితే, ఒమేగా - 3 ఎక్కువగా ఉండే గుడ్లు, ఆర్గానిక్ కోడిగుడ్లు, ఆర్గానిక్ నాన్-జీఎంవో ఫీడ్ కోడిగుడ్లు, ఫ్రీ రేంజ్ కోడి (బయట తిరిగే కోళ్లు) గుడ్లు మొదలైన వాటికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.

ఇక్కడ కోడిగుడ్ల రంగు కంటే, కోడి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, అది ఏ వాతావరణంలో పెరుగుతుందనేది ముఖ్యం.

ఉదాహరణకు, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్, లేదా విటమిన్-ఏ, లేదా విటమిన్-ఈ ఎక్కువగా ఉండే ఆహారం అందించిన కోళ్ల గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అలాంటి కోళ్ల గుడ్లలో విటమిన్-ఈ, విటమిన్-ఏ, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు, మినరల్స్, కొవ్వులు అధికంగా ఉంటాయి.

కోళ్లఫారాలలో లభించే కోడిగుడ్లలో విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.అయితే, దేశీయ నాటుకోళ్లకు సూర్యరశ్మి ఎక్కువగా తగులుతుంది. అందువల్ల వాటి గుడ్లలో విటమిన్-ఏ, డీ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది .

కోళ్లఫారాల్లోనూ మంచి దాణా వేసి జాగ్రత్తగా పెంచిన కోళ్లు పెట్టిన గుడ్లలో పోషకాలు, దేశీయ కోళ్ల గుడ్లలో కంటే ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు సంబంధం లేకపోయినప్పటికీ, గుడ్డు పచ్చసొన రంగు ప్రభావం కొంత ఉంటుంది.గుడ్డు లోపలి పచ్చసొన ముదురు రంగులో ఉంటే, విటమిన్ -ఏ, కెరోటిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ గుడ్డు రుచి కూడా ఎక్కువ.గుడ్డు పచ్చసొన రంగు ఆ కోడి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కెరోటినాయిడ్ అనే కెమికల్ ప్రభావంతో గుడ్డులోని పచ్చసొన ముదురు రంగులోకి మారుతుంది.కోడిగుడ్లలోని పచ్చసొనను ముదురు రంగులోకి మార్చేందుకు చాలా కోళ్లఫారాల్లో కెరోటినాయిడ్‌ ఇంజెక్షన్లు చేస్తారు. కొందరు ఎర్ర క్యాప్సికం తినిపిస్తారు.ఎందుకంటే, గుడ్ల రుచి, పోషక విలువలు కోళ్ల ఆహారంపై ఆధారపడి ఉంటాయి.తెల్ల గుడ్లు పెట్టే కోళ్లకు, ఎర్ర గుడ్లు పెట్టే కోళ్లకు ఒకే రకమైన ఆహారం అందిస్తే గుడ్డు రుచిలో, పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు.అంతేకాని తెల్ల గుడ్లు తింటే ఎక్కువ బలము,ఎర్ర గుడ్లు తింటే తక్కువ బలం అని ఏమి ఉండదు . ఏవి అయినా గుడ్డు గుడే .





Untitled Document
Advertisements