50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు చేసి పెద్ద మనసు చాటుకున్న అంబానీ కుటుంబం

     Written by : smtv Desk | Mon, Jul 01, 2024, 05:19 PM

50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు చేసి పెద్ద మనసు చాటుకున్న అంబానీ కుటుంబం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుటుంబం ఘనంగా నిరుపేద జంటలకు పెళ్లిళ్లు చేసి తమ పెద్ద మనసు చాటుకుంది. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లి మరో వారంలో జరగనున్న వేళ ముంబైలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన 50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదికైంది. వధూవరులకు చెందిన 800 మంది కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లంతా అంబానీ కుటుంబాన్ని మెచ్చుకుంటున్నారు.

ఏదో తూతూ మంత్రంగా పెళ్లిళ్లు చేసినట్లు కాకుండా సంప్రదాయబద్ధంగా, వేద్ర మంత్రోచ్చారణల మధ్య ముకేశ్–నీతా దంపతులు వివాహాలు జరిపించారు. ముకేశ్, నీతా అంబానీతోపాటు పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ–శ్లోకా మెహతా దంపతులు, కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్ ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. నూతన వధూవరులకు వారంతా వినమ్రంగా నమస్కరించారు. పెళ్లి బట్టలతోపాటు కానుకలను కూడా అందించారు.

వధువులందరికీ బంగారు మంగళసూత్రాలతోపాటు బంగారు చెవి కమ్మలు, ముక్కు పుడకలు, వెండి మెట్టెలు, గజ్జెలు ఇచ్చారు. అలాగే స్త్రీధనం కింద రూ. లక్ష ఒక్క రూపాయి చెక్కు అందించారు. దీంతోపాటు నవదంపతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్యాస్ స్టౌవ్, మిక్సీ, ఫ్యాన్ తోపాటు ఏడాదికి సరిపోయే నిత్యావసర సరుకులను అందజేశారు. ఇలా మొత్తంగా 36 వస్తువలను ఉచితంగా ఇచ్చారు.

మరోవైపు ఈ నెల 12న అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ ల వివాహం జరగనుంది. ఈ నెల 14వ తేదీ దాకా మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అట్టహాసంగా నిర్వహించడం తెలిసిందే. గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహించిన వేడుకకు ప్రపంచ దిగ్గజాలను ఆహ్వానించారు. ఆ తర్వాత ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ప్రయాణంలో మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేపట్టారు.







Untitled Document
Advertisements