కోచ్ ల మధ్య తేడా ఇదే

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 04:17 PM

కోచ్ ల మధ్య తేడా ఇదే

భారత్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌ ఆసక్తికరంగా జరుగుతోంది. కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7x4, 1x6) దెబ్బకి అనూహ్యరీతిలో పరాజయాన్ని చవిచూసింది. దాంతో.. భారత్ వికెట్ల పడుతున్న తీరుని అప్పటి వరకూ బాగా ఎంజాయ్ చేసిన శ్రీలంక చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. శ్రీలంక క్రికెటర్లని బూతులు తిడుతూ డ్రెస్సింగ్ రూము వెలుపల అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. మరోవైపు టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం మొదటి నుంచి ఒకే తరహాలో దరహాసం చిందిస్తూ కనిపించాడు.

వాస్తవానికి శ్రీలంక టీమ్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపించాయి. 276 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా.. 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7తో నిలిచింది. అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ క్రీజులో లేకపోవడంతో భారత్ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు. కానీ.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన దీపక్ చాహర్ అసాధారణ పోరాట పటిమని కనబర్చి మరో 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టుని గెలిపించాడు. చివర్లో అతనికి భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్: 28 బంతుల్లో 2x4) చక్కటి సహకారం అందించాడు.

భారత్ విజయానికి చివరి 24 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో చమీరా బౌలింగ్‌కిరాగా.. దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ చెరొక ఫోర్ కొట్టారు. ఎక్కువగా బ్యాట్ ఎడ్జ్ తాకుతూ కనిపించిన బంతి కీపర్ పక్క నుంచి లేదా థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్తూ కనిపించింది. దాంతో.. ఓవర్ల మధ్యలో నిబంధనల్ని అతిక్రమించి మరీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఆటగాళ్లకి సూచనలు చేసిన మిక్కీ ఆర్థర్.. చివర్లో ఆటగాళ్లు ఫీల్డింగ్ తప్పిదాలు చేయడంతో సహనం కోల్పోయాడు. రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కసారి డ్రెస్సింగ్ రూము నుంచి వెలుపలికి వచ్చి డగౌట్‌లో ఉన్న డ్రింక్స్ బాయ్ రాహుల్ చాహర్‌కి కొన్ని సూచనలు చెప్పి.. అవి దీపక్ చాహర్‌కి చేరవేయాల్సింది సూచించి వెళ్లిపోయాడు.










Untitled Document
Advertisements