ప్రారంభం అవనున్న అంబటి రాయుడు రెండవ ఇన్నింగ్స్.. ఆ జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తారా?

     Written by : smtv Desk | Wed, Jun 07, 2023, 11:25 AM

ప్రారంభం అవనున్న అంబటి రాయుడు రెండవ ఇన్నింగ్స్.. ఆ జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తారా?

రాజకీయాలకు సిని మరియు క్రీడా ప్రముఖులకు విడదీయరాని అనుబంధం ఉంది అనే విషయం తెలిసిందే. వారి రంగాలలో ఒక వెలుగు వెలిగిన తరువాత వారరి ప్రయాణం కచ్చితంగా రాజకీయాల వైపు ఉంటుంది. ఇదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఏపీలో రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు అంబటి రాయుడు స్వగ్రామం. అయితే, ఆయన తండ్రి హైదరాబాద్‌లో స్థిరపడటంతో అక్కడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. త్వరలోనే రాజకీయాలతో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

ముక్కుసూటిగా ఉండే రాయుడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో, తనకు రాజకీయాలపై ఆసక్తి ఉంది అనగానే ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అతడిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అంబటి రాయుడు తాత టీడీపీ తరఫున గెలిచి సర్పంచ్‌గా పనిచేశారు. దీంతో ఆయన్ను పార్టీలోకి తీసుకుని ఎంపీ లేదా ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తోందని సమాచారం. ఇప్పటికే గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లతో అధిష్ఠానం మంతనాలు జరిపిందని తెలుస్తోంది.

ఇదివరకు రెండు మూడుసార్లు సీఎం జగన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడంతో రాయుడు వైసీపీలోకి వెళ్తారన్న అభిప్రాయాలు బాగా ఉన్నాయి. తాడేపల్లిలో సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నాడన్న వార్తలు వచ్చాయి. దాంతో, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబును రంగంలోకి దింపి గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అంబటికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సైతం రాయుడిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు సైతం అంబటికి టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. అయితే, రాయుడు ఏ పార్టీలో చేరుతారో, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.





Untitled Document
Advertisements