వివాదంలో చిక్కుకున్న పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్

     Written by : smtv Desk | Tue, Oct 17, 2023, 12:04 PM

వివాదంలో చిక్కుకున్న పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్

రూల్స్ కి వ్యతిరేకంగా మైదానంలో నమాజ్ చేస్తూ పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ వివాదంలో ఇరుక్కున్నాడు. మహమ్మద్ రిజ్వాన్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు. ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగానే క్రికెట్ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేసినట్టు జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘భారత ప్రేక్షకుల ముందు, తన మతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడం అన్నది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’’ అని నవీన్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజ్వాన్ ఉద్దేశపూర్వక మత ప్రదర్శన క్రీడాస్ఫూర్తిని ఓడించే విధంగా ఉందన్నారు. ఈ క్రీడాకారుడి చర్య ఆట స్ఫూర్తిని ప్రశ్నించే విధంగా ఉంది. ఆట సమయంలో క్రీడాకారుడు అనుసరించిన తీరు ప్రశ్నించే విధంగా ఉందన్నారు. ‘‘మహమ్మద్ రిజ్వాన్ ఉద్దేశపూర్వకంగా తాను ముస్లింనని ప్రదర్శించడం, క్రీడాస్ఫూర్తికి ఓటమి లాంటిది. తన జట్టు సభ్యులు డ్రింక్స్ కోసం వేచి చూసిన సమయంలో రిజ్వాన్ మైదానంలో ప్రార్థనలు చేశాడు’’ అని జిందాల్ తన ఫిర్యాదులో వివరించారు.

మైదానంలో నమాజ్ చేయడమే కాకుండా, మ్యాచ్ అనంతరం విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం తన మతపరమైన, రాజకీయ సిద్ధాంతాన్ని తెలియజేస్తోందన్నారు. శ్రీలంకపై తన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు రిజ్వాన్ చేసిన ప్రకటన కూడా వివాదాస్పదం కావడం గమనార్హం. దీనికి ఇజ్రాయెల్ గట్టిగానే బదులిచ్చింది. పాకిస్థాన్ పై మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. భారత్ చేతిలో ఓడిపోవడం ద్వారా తమ విజయాన్ని హమాస్ మిలిటెంట్లకు అంకింత చేసే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేసింది.


Untitled Document
Advertisements