కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలతో కలసి నామినేషన్ వేసేందుకు వెళ్లిన సుజనా చౌదరి

     Written by : smtv Desk | Thu, Apr 18, 2024, 12:36 PM

కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలతో కలసి నామినేషన్ వేసేందుకు వెళ్లిన సుజనా చౌదరి

ప్రస్తుతం దేశమంతటా ఎక్కడ చుసిన లోక్ సభ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభమయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయల్దేరారు. అంతకు ముందు చిట్టినగర్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయల్దేరారు. కూటమికి చెందిన వేలాది మంది నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ప్రచార రథంపై దివంగత ఎన్టీఆర్ ఫొటోను ఉంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో ర్యాలీ ముందుకు సాగుతోంది. సుజనా వెంట వంగవీటి రాధ, బుద్దా వెంకన్న, కొనకళ్ల నారాయణ, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీను తదితర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. విజయవాడ వెస్ట్ లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాన్ని తిరోగమనం పట్టించారని మండిపడ్డారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజల నుంచి తనకు మంచి స్పందన వస్తోందని.. అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తాను చేసి చూపుతానని చెప్పారు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడను రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి రాజధానిగా చేసి చూపుతామని అన్నారు.

Untitled Document
Advertisements