హైదరాబాద్ వ్యక్తిపై అమెరికాలో దాడి జరిగిన ఘటన పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

     Written by : smtv Desk | Thu, Feb 08, 2024, 06:35 AM

హైదరాబాద్ వ్యక్తిపై అమెరికాలో దాడి జరిగిన ఘటన పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఈమధ్య కాలంలో అగ్రరాజ్యమైన అమెరికాలో భారత్ విద్యార్థులపై వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు మృతి చెందగా తాజాగా ఓ విద్యార్థి పై దాడి జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన స‌య్యద్ మ‌జ్హ‌ర్ అలీపై నలుగురు దుండ‌గులు దాడి చేయ‌డం తీవ్ర క‌ల‌త‌కు గురి చేసింద‌న్నారు. ఇటీవ‌ల ఓహియోలో బి.శ్రేయాష్ రెడ్డిపై కూడా దాడి జరగడంతో అత‌ను మృతి చెందారు. వ‌రుసగా తెలంగాణ విద్యార్థుల‌పై దాడులు జ‌ర‌గ‌డం ఆందోళ‌న‌ను కలిగిస్తోందన్నారు.

తెలంగాణ విద్యార్థుల భ‌ద్ర‌త‌పై త‌మ ఆందోళ‌న‌ను అమెరికాకు తెలపాల‌ని విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లో విద్య‌ను అభ్య‌సిస్తున్న తెలంగాణ విద్యార్థుల కోసం ప్ర‌త్యేక హెల్ప్ డెస్క్‌ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఎక్క‌డ ఉన్నా తమ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజ్హర్ అలీపై దాడి జరిగింది. మంగళవారం రాత్రి అతను హోటల్ నుంచి ఇంటికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తల, ముక్కు, కళ్లపై గాయాలయ్యాయి. తన మీద జరిగిన దాడిని వీడియో ద్వారా వెల్లడించారు. తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని.. అమెరికాలోని దౌత్య సిబ్బందిని అర్థించారు. తన భర్తకు సాయం చేయాలంటూ అతని భార్య ఫాతిమా రిజ్వీ కేంద్రమంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్పందించారు.





Untitled Document
Advertisements