అగ్రరాజ్యంలో కారును ఢీకొట్టిన విమానం..

     Written by : smtv Desk | Sat, Feb 10, 2024, 08:43 AM

అగ్రరాజ్యంలో కారును ఢీకొట్టిన విమానం..

ఎక్కడైనా సరే విమానాలు గాల్లో, కార్లు నేలమీద తిరగడం కామన్. అలాంటప్పుడు ఆ రెండు ఎదురుపడే అవకాశమే ఉండదు. కానీ ఓ చోట ఏకంగా విమానం కారుని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన జరిగింది. నైరుతి ఫ్లోరిడా కొల్లియర్ కౌంటీలోని రద్దీగా ఉండే పైన్ రిడ్జ్ రోడ్‌పై ఫ్లోరిడాలోని ఓ హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించిన ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తూ అటుగా వెళ్తున్న కారుని ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పెద్దఎత్తున మంటలు చెలరేగిన కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తమ కళ్ల ముందు జరిగిన ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతున్నామని, సినిమాల్లోని దృశ్యంలా అనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షి బ్రియానా వాకర్ చెప్పారు. ‘‘ మా ముందు వెళ్తున్న కారుని విమానం రెక్క ఈడ్చుకెళ్లింది. ఇదంతా సెకన్ల వ్యవధిలోనే జరిగింది. హైవేపై కారుని ఢీకొట్టడానికి క్షణాల ముందు విమానం మా తలలపై అంగుళాల ఎత్తులోనే ప్రయాణించింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. విమానం ముక్కలు హైవేపై పడ్డాయి’’ అని ఆమె వివరించారు.

కాగా కూలిన విమానం ‘బొంబార్డియర్ ఛాలెంజర్ 600 జెట్‌’గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారించింది. శుక్రవారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో క్రాష్ జరిగిందని తెలిపింది. ఒహియోలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలోని ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు విమానం బయలుదేరిందని, క్రాష్ జరిగిన సమయానికి నేపుల్స్‌ చేరుకోవాల్సిన ఉందని నేపుల్స్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధి రాబిన్ కింగ్ తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడని, రెండు ఇంజన్లు ఫెయిల్ అవడంతో ఈ ఏర్పడిందన్నారు. కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతుండగానే కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారి చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు.





Untitled Document
Advertisements