రంజాన్ స్పెషల్ హలీం ఇంట్లోనే టేస్ట్ గా తయారు చేసుకొండిలా

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 11:21 AM

రంజాన్ స్పెషల్ హలీం ఇంట్లోనే టేస్ట్ గా తయారు చేసుకొండిలా

ముస్లింల పండుగ అంటే గుర్తుకు వచ్చేది రంజాన్. రంజాన్ పేరు చెబితే అందరికి మొదటగా గుర్తొచ్చేది హలీం.ముస్లింలతో పాటు హిందువులు కూడా ఈ హలీమ్ ను బాగా ఇష్టపడతారు . ముఖ్యంగా మటన్ హలీం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొనేందుకు కొన్ని షాపుల ముందు కిలోమీటర్ల మేర లైన్లు కూడా ఉంటాయి. కొంతమంది గంటల తరబడి వెయిట్ చేసి మరీ హలీమ్‌ని కొనుక్కొని తీసుకువెళ్తారు. ఎందుకంటే హలీం వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని ఇంట్లో వండడం కన్నా కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. నిజానికి ఇంట్లోనే హలీంను చాలా సులువుగా చేసుకోవచ్చు.కానీ అది ఎలా చేయాలి అనేది చాల మందికి తెలియదు. తక్కువ మొత్తంలో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.


మటన్ హలీం రెసిపీకి కావలసిన పదార్థాలు:

మటన్ కీమా - అరకిలో

జీడిపప్పు - పావు కప్పు

నెయ్యి - పావు కప్పు

మినప్పప్పు - అరకప్పు

పెరుగు - ఒక కప్పు

కారం - అర స్పూను

పుదీనా ఆకులు - పావు కప్పు

గోధుమలు - ఒకటిన్నర కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పసుపు - పావు స్పూను

శనగపప్పు - అరకప్పు

ఉల్లిపాయ - ఒకటి

కొత్తిమీర తరుగు - అరకప్పు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

నిమ్మకాయ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - మూడు

గరం మసాలా - అర స్పూను

మటన్ హలీం రెసిపీ:
ముందుగా గోధుమలను తీసుకొని మిక్సీలో వేసి పొడిగా మార్చుకొని నీటిలో నానబెట్టాలి.ఆ తర్వాత ఇప్పుడు మటన్ కీమాను శుభ్రంగా కడిగి ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని కుక్కర్లో వేసి నాలుగు ఐదు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మిక్సీలో పొడిలా చేసుకున్న గోధుమలను, మినప్పప్పును, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి వేసి పది గ్లాసుల నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి.

ఇది ఉడకడానికే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మద్యస్థ మంట మీద ఉంచి ఉడికిస్తూనే ఉండాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదు అంటే అది మాడిపోతుంది . ఈ మొత్తం మిశ్రమం పేస్టులా అయ్యే వరకు అలా ఉంచాలి.

ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించుకోవాలి. అది ఉడికాక పెరుగు వేయాలి. పెరుగు బాగా కలిపాక మూత పెట్టి ఒక పది నిమిషాలు పాటు వదిలేయాలి.తర్వాత మళ్లీ మూడు కప్పుల నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి.

ఇది బాగా ఉడికాక ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమలు మినప్పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి నెయ్యి వేయాలి. మంట తగ్గించి అరగంట పాటు అలా వదిలేయాలి. అది ఉడుకుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. అది బాగా ఉడికాక హలీంలాగా అవుతుంది.

ముందుగానే ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో వేయించి రంగు మారేవరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. హలీం పూర్తయిన తర్వాత పైన ఉల్లిపాయల వేపుడును చల్లుకోవాలి. తినే ముందు నిమ్మరసాన్ని పిండుకొని కొత్తిమీర, పుదీనా తరుగును వేసుకుంటే సరిపోతుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది.అంతే చాల టేస్ట్ గా ఉండే హలీమ్ రెడీ అయినట్లే. కానీ ఇది వండడానికి కనీసం మూడు గంటల

సమయం పడుతుంది.అందుకే ఎక్కువమంది కొనేందుకు ఇష్టపడతారు. ముస్లిం సోదరులు ఎంతోమంది దీనిని ఇంట్లో వండుకుంటారు.

హలీం ఒక కప్పు తింటే చాలు పొట్ట నిండిన భావన వస్తుంది. ఇది తినడం వల్ల ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. దీనిలో వాడిన పధార్థాలు అన్ని మటన్, కొత్తిమీర, పుదీనా, మినప్పప్పులు, శనగపప్పులు ఇలా అన్నింటిలోనూ మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి. కాబట్టి హలీం తినడం వల్ల ఆరోగ్యమే కలుగుతుంది . కానీ ఎక్కువ మొత్తంలో తింటే అరగకపోవచ్చు. కాబట్టి ఒక కప్పుతోనే ఆపేయడం మంచిది.ఏది అయినా కొంచమే తినాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది .





Untitled Document
Advertisements