అయోధ్యలో నిర్మాణ విరాళాలు...కోట్లు విలువ చేసే 15 వేల చెక్కులు బౌన్స్!!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 03:42 PM

అయోధ్యలో నిర్మాణ విరాళాలు...కోట్లు విలువ చేసే 15 వేల చెక్కులు బౌన్స్!!

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాలకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విరాళాలుగా ఇచ్చిన చెక్కులు భారీ సంఖ్యలో బౌన్స్‌ అయ్యాయి. వాటి మొత్తం సుమారు రూ.22 కోట్లకు పైగానే ఉంటుందట. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. ఆడిట్‌లో సుమారు 15 వేల చెక్కులు బౌన్స్ అయినట్లు తేలింది.

బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకపోవడం.. చెక్కులపై సంతకాలు సరిపోలకపోవడం వంటి సాంకేతిక కారణాలతో వేల సంఖ్యలో చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ చెక్కుల విషయమై ట్రస్ట్ కమిటీ బ్యాంకులతో సంప్రదిస్తోందని.. ఇబ్బందులను తొలగించేవిధంగా ప్రయత్నిస్తోందని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. చెక్కులు చెల్లకపోవడంతో బ్యాంకు వారికి మరో అవకాశం ఇస్తుందని.. తప్పులు సరిచేసి చెక్కులు అందజేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు.

బౌన్స్ అయిన చెక్కుల్లో అయోధ్య నుంచి వచ్చినవే సుమారు 2 వేల వరకూ ఉన్నాయని ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మిగిలిన 13 వేల చెక్కులు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయని చెప్పారు. చెల్లని చెక్కులను తిరిగి వారికే పంపి.. కొత్త చెక్కులు పంపాలని కోరనున్నట్లు గిరి వెల్లడించారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ గత జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకూ

విరాళాలు సేకరించింది. ఇప్పటి వరకూ అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశం నలువైపుల నుంచి సుమారు 2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రామమందిరం ట్రస్టు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.





Untitled Document
Advertisements