వృద్ధురాలిపై చిరుత దాడి...ఎలా తప్పించుకుందో చూడండి! వీడియో!

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:12 PM

వృద్ధురాలిపై చిరుత దాడి...ఎలా తప్పించుకుందో చూడండి! వీడియో!

తనపై దాడిచేసిన చిరుతను ఊతకర్రతో ఎదుర్కొని, దాని బారి నుంచి ఓ మహిళ తనను తాను కాపాడుకుంది. ముంబయిలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబయి ఆరే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే చిరుత రెండోసారి దాడి చేయడం గమనార్హం. ఆరే డెయిరీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల్లో తొలుత చిరుతపులి నడుచుకుంటూ రావడం.. ఓ నిమిషం తర్వాత ఓ మహిళ ఊతకర్ర పట్టుకుని మెల్లగా నడిచి వస్తోంది. నిర్మలా దేవి సింగ్ (55) అనే మహిళ అక్కడే ఉన్న అరుగులా ఉన్న ఓ గోడపై కూర్చుని ఉండగా.. చిరుత ఆమెపై దూసుకొస్తోంది. దీనిని గమనించి ఆ మహిళ తన ఊతకర్ర సాయంతో చిరుతను ఎదుర్కొని పక్కకు తోసేసింది.. ఈ క్రమంలో నిర్మలా దేవి సింగ్ గొడపై నుంచి కింద పడిపోయింది. అయినా సరే ఊత కర్రతో చిరుతను అదిలించడంతో ఆ అడవి జంతువు వెనక్కు తగ్గింది.. ఇంతలో ఆమె సాయం కోసం భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు . దీంతో చిరుత అక్కడ నుంచి పారిపోయింది. ఈ మొత్తం తతంగం అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ ఘటనలో మహిళ స్వల్పంగా గాయపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భయపడిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఊతకర్ర సాయంతో పోరాడి ప్రాణాలను రక్షించుకుంది. స్వల్ప గాయాలు కావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల కిందట ఇదే ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడికి పాల్పడింది. చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటుండగా వచ్చిన చిరుత పులి దాడిచేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. దీనిని గమనించి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో బాలుడ్ని వదిలేసి పారిపోయింది. ముంబయి నగరం దట్టమైన పొదలు, చెట్లతో నిండి ఉండే ఏకైక ప్రాంతం ఆరే. ఇక్కడ పలు రకాల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటాయి. అనేక సందర్భాల్లో చిరుతలు జన సంచారంలోకి వచ్చిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.






Untitled Document
Advertisements