తిరిగి విధుల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. నిషేధం ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 12:23 PM

తిరిగి విధుల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. నిషేధం ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే . భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈయనను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వెంకటేశ్వరావు పై విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ఈ ఏడాది ఫిబ్రవరి 7 తో పూర్తయింది. దీంతో, ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసులో ఉన్నట్టు గుర్తించి వెంకటేశ్వరరావుకు అందాల్సిన ప్రయోజనాలన్నింటినీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేసి, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఆయనకు చెల్లించాల్సిన జీతాన్ని కూడా చెల్లించాలని, సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసు కింద పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండరాదు. రెండేళ్లకు మించితే సస్పెన్షన్ ముగిసినట్టే ఈ నిబంధన మేరకే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయనను సర్వీస్ లోకి తీసుకోవాలని ఏబీవీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి రెండు సార్లు వెళ్ళగా ఆయన ఆ రెండు సార్లు అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చేసారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలని ఏబీవీ మరోసారి వినతిపత్రాన్ని సీఎస్ కార్యాలయంలో సమర్పించి వచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వరావుపై నిషేధాన్ని ఎత్తివేసింది.









Untitled Document
Advertisements