దసరా ప్రత్యేక రైళ్లల్లో అదనపు చార్జీల మోత

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:48 PM

దసరా ప్రత్యేక రైళ్లల్లో అదనపు చార్జీల  మోత

భారతీయులకు అతి పెద్ద పండగ అంటే దసరా అనే చెప్పుకోవచ్చు.. మరి ఈ పండుగకు వారం రోజుల పాటు సెలవులు తీసుకొని ఎవరైనా తమ స్వగ్రామలకి వెళ్తారు..మరి ఈ దసరా సందర్భంగా రైలు ప్రయాణికులకు అదనపు చార్జీల మోత మోగనున్నది. వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నది. అయితే రెగ్యులర్‌ చార్జీలపై ప్రత్యేక రైళ్లలో అదనంగా 30 శాతం మేర వసూలు చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ఇతర మార్గాలలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో 30 శాతం వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నది. ఇదే తరహాలో దసరా ప్రత్యేక రైళ్లలోనూ అదనపు చార్జీల వసూళ్లకు రైల్వేశాఖ సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం.
4.20 లక్షల మంది చేరవేతకు 150 రైళ్లు : దసరాకు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 4.20 లక్షల మందిని తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే 150 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి వంటి స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో 2020, 2021లో దసరాకు అనుకున్నన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేలేకపోయారు. ఈసారి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నర్సాపూర్‌, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపించనున్నారు. అలాగే నిజామాబాద్‌, కాజీపేట్‌కు దసరా కోసం డెము రైళ్లను నడిపించబోతున్నట్టు తెలుస్తున్నది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ నెల 24 లేదా 25 నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా, రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి.





Untitled Document
Advertisements