భారత్ లో థియేటర్ల సంఖ్య తగ్గుముఖం.. చైనాలో మన సినిమా జోరు

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 04:12 PM

భారత్ లో థియేటర్ల సంఖ్య తగ్గుముఖం.. చైనాలో మన సినిమా జోరు

ముంబయిలో ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో సినిమా థియేటర్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని అన్నారు.
ఐదారు సంవత్సరాల క్రితం దేశంలో 12 వేల సినిమా థియేటర్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 8 వేలకు పడిపోయిందని తెలిపారు. అదే సమయంలో చైనాలో సినిమా హాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని, ఐదారేళ్ల కిందట చైనాలో 10 వేల థియేటర్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పెరిగిందని అన్నారు.
ఈ కారణంగానే భారతీయ చిత్రాలు దేశంలో కంటే చైనాలో అధికంగా ప్రదర్శితమవుతున్నాయని అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలకు ఇక్కడి కంటే చైనాలో అధిక బిజినెస్ లభిస్తోందని తెలిపారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించాలంటే, దేశంలో మరిన్ని థియేటర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం కొత్తగా ఫిలిం ఫెసిలిటేషన్ ఆఫీస్ (ఎఫ్ఎఫ్ఓ) ఏర్పాటైందని, సినిమా థియేటర్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను ఈ కార్యాలయం వేగంగా మంజూరు చేస్తుందని అపూర్వ చంద్ర తెలిపారు. కావున ప్రజలకు సినిమా ప్రధాన వినోదం అని, టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements