మధ్యతరగతి వారికి తీపి కబురు అందించిన కేంద్రప్రభుత్వం..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:33 PM

మధ్యతరగతి  వారికి తీపి కబురు అందించిన కేంద్రప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. మధ్యతరగతికి ఊరట కలిగే ప్రకటన చేసింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్ల పెంచుతున్నట్లు వెల్లడించింది
దీని వల్ల చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. పలు పథకాలపై ఇక నుంచి అధిక వడ్డీ లభించనుంది. అక్టోబర్ 1 నుంచి వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుంది.
మోదీ సర్కార్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేటును పెంచింది. అంటే 2022 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వడ్డీ రేటు పెంపు 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంది. ఎంపిక చేసిన పథకాలకు మాత్రమే పెంపు వర్తిస్తుంది. స్కీమ్ ప్రాతిపదికన వడ్డీ రేటు పెంపు మారుతూ ఉంటుందని చెప్పుకోవాలి.
సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులో మార్పు లేదు. 4 శాతం వడ్డీనే కొనసాగుతోంది. ఏడాది టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు పెరగలేదు. స్థిరంగా 5.5 శాతంగానే ఉంది. రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై అయితే వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 5.7 శాతానికి చేరింది.మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 5.8 శాతానికి చేరింది. ఇదివరకు వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు స్థిరంగా ఉంది. 6.7 శాతంగానే కొనసాగుతోంది.
అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటులో మార్పు లేదు. 5.8 శాతంగానే కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై అయితే వడ్డీ రేటు 7.4 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. అలాగే మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పెరిగింది. 6.6 శాతం నుంచి 6.7 శాతానికి చేరింది. అలాగే కిసాన్ వికాస్ పత్ర పథకంపై కూడా వడ్డీ రేటు పైకి చేరింది. 7 శాతం వడ్డీ వస్తుంది. ఇది వరకు వడ్డీ రేటు 6.9 శాతంగా ఉండేది. అయితే కేంద్రం మాత్రం ప్రధాన పథకాలపై వడ్డీ రేట్లను పెంచలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటులో మార్పు లేదు. గతంలో ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే వడ్డీ రేట్లు కొనసాగాయి.





Untitled Document
Advertisements