ఐటీ జాబ్స్ వద్దనుకుంటున్న నిపుణులు.. ఈ రంగాలకు డిమాండ్

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 04:35 PM

ఐటీ జాబ్స్ వద్దనుకుంటున్న నిపుణులు.. ఈ రంగాలకు డిమాండ్

ఐటీ రంగం పై టెక్ నిపుణులకు అయిష్టత పెరిగిందా లేదా క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు డిమాండ్ పెరగడంతో అటు వైపు వెళ్లాలనుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ప్రముఖ టెక్ స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ ఇటీవల ఈ విషయంపై సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలను ‘టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’పేరుతో వెల్లడించింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 57 శాతం మంది ఐటీ నిపుణులు భవిష్యత్తులో ఐటీ సేవల రంగానికి తిరిగి వచ్చే ఆలోచనలో లేరని సర్వేలో తేలింది.
ఐటీ నిపుణుల ఆలోచనల్లో మార్పులకు గల కారణాలను సర్వే వెల్లడించింది. ఉద్యోగుల ప్రాధాన్యత విషయాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయని తెలిపింది. గతంలో జీతం మాత్రమే ప్రాధాన్యతగా ఉండేదని.. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, విలువ వంటి అంశాలకు ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే రిపోర్ట్ పేర్కొంది. అయితే, జీతం పెరుగుదల పనితీరును మెరుగుపరుస్తుందని, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందన్న అపోహ ఇప్పటికీ ఉండడం గమనార్హం.
ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, విలువలు వంటి అంశాల ఆధారంగా ఉద్యోగులు తమ కెరీర్‌ ప్లాన్ చేసుకుంటూ, ప్రస్తుత ఉద్యోగాలను మధ్యలోనే అర్ధాంతరంగా వదులుకుంటున్నారని టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉద్యోగుల్లో విస్తృతమైన ఆప్షన్లకు ప్రధాన కారణమవుతోందని నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు ఇటీవల డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో టెక్ ఉద్యోగుల చూపు ఈ రంగాల వైపు మళ్లిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగాలు జాతీయ జీడిపీ కి 9 శాతం వాటాను అందించాయి. ఇక, సేవల ఎగుమతుల్లో 51 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.5 లక్షల మంది ఫ్రెషర్‌లను నియమించుకున్నాయి. ఇందులో 2 లక్షలకు పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఒక సంవత్సరం నియామకాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ మాట్లాడుతూ.. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాల కోసం చేసే సాధారణ డిమాండ్‌ అనేది కొత్త ఉద్యోగాల్లోని ఉద్యోగులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అయితే అంతర్గత విధానాలు, ఎక్స్‌టర్నల్ ప్యాక్టర్స్‌పై యాజమాన్యాలు పునరాలోలించాలని చెప్పారు. వర్క్, లైఫ్ గురించి ఉద్యోగుల్లో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
సంస్థల వ్యూహాత్మక నియామక ప్రణాళికలు తప్పనిసరిగా ఉద్యోగుల మెరుగుదల పట్ల స్పష్టమైన లక్ష్యంతో ఉండాలని సునీల్ అభిప్రాయపడ్డారు. అలా లేకపోతే, చివరికి ఒక ఉద్యోగి పనిలో తనను విలువైనదిగా భావిస్తున్నారా లేదా కేవలం ఇతరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఫలితాలను, విలువను సృష్టించడం వంటి అంశాలపై ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి విలువ ప్రతిపాదనలో ప్రాథమిక మార్పులు జరిగితే ఉద్యోగి-యజమాని సంబంధాలు బలపడతాయని అది ఇరువురి ప్రయోజనాలకు దారితీస్తుందని సునీల్ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements