పాత వస్తువులతో ఇంటిని ఓ మినీ మ్యూజియంల మార్చిన వైద్యుడు..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:57 AM

పాత వస్తువులతో ఇంటిని ఓ మినీ మ్యూజియంల మార్చిన వైద్యుడు..

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్టు.. ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఎవరి దగ్గరా లేనివి తనవద్దే ఉండాలన్న ఆలోచన మరికొందరిలో ఉంటుంది. అదే ఆలోచన వాళ్లని పదిమందిలో ప్రత్యేకంగా నిలుపుతుంటుంది. అలాంటి ప్రత్యేకమైన వాళ్లలో ఒకరే ఆయుర్వేద డాక్టర్ కాళహస్తి వెంకటేశ్వరరావు. ఖమ్మంలో ఆయుర్వేద వైద్యునిగా ప్రాచుర్యం పొందిన వెంకటేశ్వరావు పురాతన అరుదైన వస్తు సేకరణలోనూ తనదైన శైలిని ఆవిష్కరిస్తున్నారు.
బ్రిటిష్ కాలం నాటి నుండి సేకరించిన అనేక దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు , రాజముద్రికలు, మెడల్స్ , పోస్ట్ కార్డు, స్టాంపులు కొన్ని ఏళ్ల క్రితం నాటి ప్రాచీన వస్తువులు ఆయన దగ్గర మ్యూజిలో ఉన్నట్లుగా భద్రంగా ఉన్నాయి. ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యులు కాళహస్తి వెంకటేశ్వరావు గత పదిహేను సంవత్సరాల నుండి సుమారుగా డెబ్బై విదేశాలకు సంబంధించిన వెండి, నికెల్, ఇత్తడి , రాగి నాణేలు , కరెన్సీ నోట్లను సేకరిస్తూ వస్తున్నారు. వీటితో పాటుగా తంజావూరు రాజముద్రికలు , బ్రిటిష్ కాలంలో వాడిన కోటు బటన్లు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారు. తన కంటికి అరుదైన వస్తువుగా కనిపించినా ..లేదంటే ఏదైనా పేపర్లో చూసినా ఇట్టే దాన్ని తన దగ్గరకు తెచ్చుకునేలా కృషి చేస్తున్నారు.
అంతే కాకుండా పురాతన భారతీయ , విదేశీ స్టాంపు పేపర్లు , పోస్టుకార్డులు , మెడల్స్ , పందొమ్మిది వ శతాబ్దానికి చెందిన పావు ఇంచు తెలుగులో ముద్రించిన నాణెం , పురాతన ఆయుర్వేదిక పుస్తకాలు , మొదటి ప్రపంచ , రెండవ ప్రపంచయుద్ధపు మెడల్స్ సేకరించారు డాక్టర్ వెంకటేశ్వరరావు. మరియు ఓవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు తన కాయిన్స్, ఓల్డ్ కలెక్షన్‌ని తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఆ హాబీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తాను సేకరించిన వస్తువులను ఎంతో భద్రంగా, అత్యంత పదిలంగా తన మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఈ విధంగా తనకు నచ్చిన వస్తువులు, నాణెలు, కరెన్సీ నోట్లను సేకరించడం తన మనసుకు ఎంతో ఉల్లాసం కలిగిస్తుందంటున్నారు వెంకటేశ్వరరావు. ఇదే తరహా అభిలాషను ఇంకా కొనసాగిస్తానని మరిన్ని దేశాలకు సంబంధించిన వస్తువులు సేకరిస్తానని చెబుతున్నారు.
వెంకటేశ్వరరావుకు ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. అనేక దేశాలలో ఉన్న తన మిత్రులు ద్వారా కొన్ని , వేలంపాటలో మరికొన్ని సేకరించడం జరిగిందంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి హౌజ్ ట్యాక్స్ , వన్ రూపీ నోట్ నుండి ఒక మిలియన్ డాలర్ వరకు ( పది లక్షల రూపాయల నోటు ) వరకు ఉందన్నారు.
కాగా ఎంతో మంది పాత నాణెలు, కరెన్సీ నోట్లను కలెక్ట్ చేసే వాళ్లను చూసి ఉంటాం. కాని ఖమ్మంలో ఆయుర్వేద డాక్టర్ వెంకటేశ్వరరావు మాత్రం ..కరెన్సీ నోట్లతో పాటు విలువైన వస్తువులను సేకరిస్తూ అందరికంటే తాను సెపరేట్ అని నిరూపించుకుంటున్నారు.





Untitled Document
Advertisements