వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్న 5G టెక్నాలజీ..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 01:36 PM

వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్న 5G టెక్నాలజీ..

భారత దేశంలో ఎంపిక చేసిన నగరాలలో అక్టోబర్ 1 ఆనగా నేటి నుంచి 5G సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సేవల రాకతో సమీప భవిష్యత్తులో వినూత్న మార్పులు జరుగతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా 5జీతో ఇంటర్నెట్ స్పీడ్ మరింత పెరుగుతుంది. మానవ జీవితం టెక్నాలజీతో ముడిపడి ఉంది. ప్రతి విషయంలో సాంకేతికత సాయం తప్పనిసరి. కాగా వ్యవసాయ రంగంలో మాత్రం టెక్నాలజీ వాడకం ఇంకా తక్కువగానే ఉంది. ఈ క్రమంలో 5Gతో వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలకవచ్చు. ఈ రంగంలో టెక్నాలజీతో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. దీనిని జనాలు ఇంకా సంప్రదాయ పద్ధతులలోనే చేస్తున్నారు. 5G టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ , కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 5Gని వ్యవసాయ రంగంలో వాడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. 5జీ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు జరిగి అన్నదాతకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆ మార్పుల గురించి వారు వివరిస్తున్నారు.
రైతులు వ్యవసాయానికి అనుబంధంగా చేసే పాడిపరిశ్రమలో 5G సాంకేతికతతో మేలు జరగనుంది. ఈ టెక్నాలజీతో పశువుల పెంపకం సులభతరం చేసుకోవచ్చు. టెక్నాలజీ సాయంతో పశువుల ఆరోగ్యం, అవి ఉన్న ప్రదేశం, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. అవి తీసుకునే ఆహారం, సంతానోత్పత్తి, ఇతర విషయాలపై అవగాహన పెంపొందిచుకోవచ్చు. ఫలితంగా పాడి పరిశ్రమతో రైతన్నకు శ్రమ తగ్గి లాభం పెరుగుతుంది.
వ్యవసాయ సంబంధిత అప్లికేషన్స్ ఆధారంగా రైతులు 5జీతో విశ్వసనీయమైన సమాచారం అత్యంత వేగంగా పొందవచ్చు. వాతావరణ పరిస్థితులు, వర్షపాత నమోదుతో పాటు ఆ రంగానికి సంబంధించిన ఇతర కీలక సమాచారం క్షణాల వ్యవధిలో తెలుసుకుని తగు చర్యలు తీసుకోవచ్చు. వ్యవసాయ మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న పంటల గురించి, విత్తనాలు, ఎరువులు, తము పండించే పంటకు పలకబోయే ధర వివరాలను అప్‌టు‌డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫార్మర్స్ చాలా ఈజీగా అన్ని విషయాలను ఒక్క క్లిక్‌తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
వ్యవసాయంలో ప్రధాన అంశం నీటి పారుదల. 5G టెక్నాలజీతో స్మార్ట్ ఇరిగేషన్ చేయవచ్చు. అన్నదాతకు అలా ప్రయోజనాలు ఇంకా పెరుగుతాయి. పంటలకు నీరు అందించడం ముఖ్యమే కానీ, అది ఎప్పుడు అందించాలనేది కీలకం. సరైన సమయంలో నీరు పెట్టడం వల్ల దిగుబడి పెరుగుతుంది. 5G సాంకేతికత సాయంతో మట్టి లోపల ప్రోబ్స్ పాతిపెట్టాలి. వీటితో మట్టిలోని తేమ శాతం, నమూనా, లవణీయత వంటి విషయాలు తెలుస్తాయి. వాటి ఆధారంగా పంటల ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు. సరైన సమయంలో తగు చర్యలు తీసుకొని పంట దిగుబడి పెంచుకునే మార్గాలను అన్వేషించవచ్చు.
వ్యవసాయంతో పోల్చితే వివిధ రంగాలలో యంత్రాల వినియోగం బాగా పెరిగింది. అగ్రికల్చర్ సెక్టార్‌లోనూ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ, కొన్ని పనులు ఇంకా పాత పద్ధతులలో సంప్రదాయ విధానాల్లోనే జరుగుతున్నాయి. ఫలితంగా మానవుడికి శ్రమ, ఖర్చు ఎక్కువవుతుంది. స్మార్ట్ ఫార్మింగ్‌లో భాగంగా 5జీ టెక్నాలజీతో వివిధ యంత్రాల వినియోగంతో లాభాలు పొందవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి లేకుండానే యంత్రాల ఆధారంగా పనులు చేయవచ్చు. పంటల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుని బోలెడు లాభాలు పొందవచ్చును.





Untitled Document
Advertisements