ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గోల్డెన్ స్కీమ్‌ త్వరపడండి.. 6వ తేది వరకే

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 02:06 PM

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గోల్డెన్ స్కీమ్‌ త్వరపడండి.. 6వ తేది వరకే

ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన కస్టమర్ల కోసం ఈ గోల్డెన్ ఇయర్‌లో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీనిపై అదనపు వడ్డీ రేట్ల ప్రయోజనాలను కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఛాన్స్. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని తీసుకొచ్చింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ ’పేరుతో ఈ స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని లాంచ్ చేసింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో కస్టమర్లు కేవలం ఈ నెల 6వ తేదీ వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు వీలు ఉంది. పరిమిత కాల వ్యవధిలోనే తీసుకొచ్చిన ఈ కొత్త ఎఫ్‌డీ పథకంపై ఐసీఐసీఐ బ్యాంకు అదనపు వడ్డీలను ఆఫర్ చేస్తుంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల మధ్యలో ఉంది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తున్న 0.50 శాతానికి అదనంగా మరో 0.10 శాతం వడ్డీ లభించనుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య కాలంలో సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంకు 6.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంటే ఈ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌పై సీనియర్ సిటిజన్లు అదనంగా 0.10 శాతం వడ్డీని కలుపుకుని 6.70 శాతం వడ్డీ ఆదాయాన్ని పొందనున్నారు. బ్యాంకు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. ఎవరైతే ఈ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తెరుస్తారో వారికి ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. అదేవిధంగా ఈ కాలంలో ఎవరైనా తమ ఎఫ్‌డీని రెన్యూవల్ చేసుకున్నా కూడా ఈ అదనపు వడ్డీ ప్రయోజనాలను పొందనున్నారు. అయితే వారి పేరుతో కేవలం ఒకే ఒక్క ఎఫ్‌డీ తెరిచి ఉండాలి. మరోవైపు ప్రైవేట్ రంగానికి చెందిన ఈ దిగ్గజ బ్యాంకు తన ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు వడ్డీ రేట్లను పెంచుతూ నిన్ననే శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఈ ప్రైవేట్ దిగ్గజం 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లను శుక్రవారం నుంచే అమల్లోకి తెచ్చింది. రూ.2 కోట్ల కంటే తక్కువున్న మొత్తాలకు ఈ పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వారం రోజుల నుంచి పదేళ్ల మధ్య కాలంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు 3 శాతం నుంచి 6.10 శాతం మధ్యలో వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. కాగా, నిన్ననే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లను పెంచింది. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచుతూ తన మానిటరీ పాలసీ ప్రకటన విడుదల చేసింది. ఈ పెంపు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టిన వారికి అత్యధిక వడ్డీలు లభించనున్నాయి. బ్యాంకులు కూడా వరుస బెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సమీక్షిస్తున్నాయి.





Untitled Document
Advertisements