వృద్దుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 06:57 PM

వృద్దుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు..

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ కీలక రెపో రేట్లు పెంచుతూ పోతుంది. దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లతో పాటు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ముఖ్యంగా డిపాజిటర్లను ఆకర్షించడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను గరిష్ట స్థాయికి పెంచాయి. ఫలితంగా ఇప్పుడు చాలా బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే వడ్డీ రేట్లు ఏకంగా 9 శాతానికి చేరాయి. ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనిటీ బ్యాంక్.. 181 రోజుల నుంచి 501 రోజుల కాలపరిమితితో అందించే ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9శాతం వడ్డీని అందిస్తోంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ ఎస్ ఏ ఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీ లపై గరిష్టంగా 8.5% వరకు వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్‌డీలలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టవచ్చు.. రిటర్న్స్‌కు ఫుల్ గ్యారెంటీ ఉంటుందా.. ఇన్సూరెన్స్ ఎంత వరకు వర్తిస్తుంది.. తదితర వివరాలు చూద్దాం. లీడింగ్ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ తదితర వాటి కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అందించే వడ్డీ రేట్లు సాధారణంగా అధికంగా ఉంటాయి. దీంతో ఎస్ ఎఫ్ బీ ఎస్ అందించే అధిక ఎఫ్‌డీ రేట్లు, సీనియర్ సిటిజన్‌లకు టర్మ్‌ డిపాజిట్ స్కీమ్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశంగా మారాయి. అయితే ఎక్కువ మొత్తంలో చేసే పెట్టుబడులకు పూర్తి స్థాయిలో డిపాజిట్ ఇన్సూరెన్స్ లేదా రాబడికి గ్యారెంటీ ఉండదు.
అయితే ఆర్బీఐ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. రూ. 5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్లకు బీమా సౌకర్యం ఉంటుంది. ఈ పరిమితిలోనే అసలు, వడ్డీ కలిసి ఉంటాయి. దీంతో ఒకవేళ షెడ్యూల్డ్ బ్యాంక్ దివాళా తీసినా లేదా మూతపడినా డిపాజిటర్లు రూ.5 లక్షల వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు తమ కస్టమర్లకు రిఫండ్ చేయడానికి కూడా టైమ్ లిమిట్ ను నిర్దేశించింది ఆర్బీఐ. బ్యాంకులు దివాళా తీసినా 90 రోజుల్లోపు డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
కావున ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ సాధారణంగా సేఫ్‌గా పరిగణిస్తుంటారు. అయితే, డిపాజిటర్లు పెట్టుబడి పెట్టే ముందు బ్యాంకు సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బ్యాంకు దీర్ఘకాలంగా కొనసాగడంపై సందేహాలు ఉంటే, అధిక వడ్డీ రేట్ల ఆకర్షణకు గురికాకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ.5 లక్షలకు మించని ఎఫ్‌డీలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే, రూ.5 లక్షల బీమా పరిమితిని దృష్టిలో ఉంచుకుని వివిధ బ్యాంకుల్లో మల్టిపుల్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గ్యారెంటీ రిటర్న్స్ కోసం సీనియర్ సిటిజన్లు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి డిపాజిట్ స్కీమ్స్‌ను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.





Untitled Document
Advertisements