ఈ రోజునే విడుదలైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ రివ్యూ

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 05:45 AM

ఈ రోజునే విడుదలైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ రివ్యూ

అల్లరి నరేష్ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా పేరొందాడు. అయితే అల్లరి నరేశ్ హాస్య కథానాయకుడిగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన విభిన్నమైన .. విలక్షణమైన కథలను ఎంచుకోనున్నట్టుగా చెప్పాడు. అలా ఆయన చేసిన 'నాంది' సినిమా విజయాన్ని సాధించింది. నటుడిగా నరేశ్ ను మరో మెట్టు ఎక్కించింది. ఆ తరువాత సినిమా అయిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కూడా, కొత్తగా ఆయన ఎంచుకున్న మార్గంలో నడిచేదే. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.
కథాపరంగా చూసుకుంటే .. శ్రీనివాసరావు (అల్లరి నరేశ్) తెలుగు టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. తెలుగు భాషపట్ల ప్రేమ .. సామాజిక సేవ పట్ల ఉత్సాహం ఉన్నవాడు ఆయన. అలాంటి ఆయన ఎలక్షన్ డ్యూటీలో భాగంగా పరమేశ్ (వెన్నెల కిశోర్)తో కలిసి 'మారేడుమిల్లి'కి వెళతాడు. అక్కడి గిరిజనులు ఆ అడవిలో తిరుగుతున్న వృషభాన్ని వీరభద్రుడుగా భావిస్తూ ఉంటారు. దానికి ఎదురెళ్లే ధైర్యం చేయరు. శ్రీనివాసరావు అక్కడి వాళ్లందరినీ ఒక చోటుకు చేర్చి, 'ఈవీఎం' ల పనితీరును గురించి వారికి చెప్పాలనుకుంటాడు.
అయితే తమ గూడెంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా వాగుదాటి వెళ్లవలసి వస్తుంది గనుక, దానిపై బ్రిడ్జ్ కట్టాలని వారు కోరతారు. అలాగే తమ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని అంటారు. హాస్పిటల్ అందుబాటులో లేకపోవడం వలన ఎంతోమంది చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. 30 ఏళ్లుగా ఓట్ల కోసం మాత్రమే తమని ఉపయోగించుకుంటున్నారనీ, అందువలన తమ కోరికలను నెరవేర్చేవరకూ ఓట్లు వేయమని తేల్చి చెబుతారు.
అక్కడి గిరిజనుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన శ్రీనివాసరావుకి, వాళ్ల కోరిక ధర్మబద్ధమైనదని అనిపిస్తుంది. వాళ్లకి ఎలాగో నచ్చజెప్పి .. అందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చి పోలింగును పూర్తి చేస్తాడు. బ్యాలెట్ బాక్సును తీసుకుని .. పోలీస్ రక్షణతో వారు అడవి దాటడానికి ప్రయత్నిస్తూ ఉండగా, శ్రీనివాసరావును .. పరమేశ్ ను అక్కడి గిరిజనులే కిడ్నాప్ చేస్తారు. బ్యాలెట్ బాక్సుతో పాటు శ్రీనివాసరావును .. పరమేశ్ ను తీసుకుని రావడానికి కలెక్టర్ అర్జున్ త్రివేది (సంపత్ రాజ్) రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి.. అనేదే కథ.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే టైటిల్ వినగానే, అక్కడ గిరిజనులు ప్రభుత్వానికి చేసిన విన్నపం అనే విషయం .. పొలిటికల్ టచ్ తో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమైపోతుంది. ఈ తరహా కథల్లో లవ్ .. రొమాన్స్ .. కామెడీని ఆశించలేమనే విషయం ఆడియన్స్ కి తెలుసు. ఈ కథ ఒక సమస్య చుట్టూ తిరుగుతుంది .. ఆ సమస్యకి పరిష్కారం ఏం చెప్పారు? ఎలా చెప్పారు? అనేది చూడాలనుకునేవారే సినిమాకి వస్తారు.
కథలో బలమైన అంశం 'మారేడుమిల్లి' ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు. అయితే కథనంలో వేగం కనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ కథను సాగదీస్తూ వెళ్లినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ ఆరంభంలో కలెక్టర్ గా సంపత్ రాజ్ రంగంలోకి దిగిన తరువాతనే కథలో కాస్త కదలిక మొదలవుతుంది. ఒక వైపున గిరిజనుల ఎమోషన్ .. మరో వైపున పోలీస్ అధికారుల యాక్షన్ .. ఇంకో వైపున వెన్నెల కిశోర్ - రఘుబాబు కామెడీతో కథను బోర్ కొట్టించకుండా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఏఆర్. మోహన్.
అల్లరి నరేశ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన కాస్త ఒళ్లు చేశాడు .. అందువలన గిరిజన గూడెంలో లుంగీపై డాన్సు చేయడానికి బాగానే ఇబ్బంది పడ్డాడు. ఇక ఆనంది అందాల చందమామలా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఎవరి మాటను చెవిన పెట్టకుండా తనకి తోచినట్టుగా ముందుకువెళ్లే కలెక్టర్ గా సంపత్ రాజ్ తన మార్కు చూపించాడు.
శ్రీచరణ్ పాకాల అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. ఏ పాట కూడా బోర్ అనిపించదు. 'నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా' .. 'కోలో కోలో కోయిలా' అనే పాటలు మరింత బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథలో నుంచి ఆడియన్స్ జారిపోకుండా తీసుకుని వెళుతుంది. ఇక రామ్ రెడ్డి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు బలమని చెప్పాలి. మారేడుమిల్లి ఫారెస్టును ఈ స్థాయిలో ఇంతవరకూ ఎవరూ కవర్ చేయలేదేమో అనిపిస్తుంది. పాటలను ... నది నేపథ్యంలోని దృశ్యాలను కూడా గొప్పగా చిత్రీకరించాడు.
ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అబ్బూరి రవి రాసిన సంభాషణల్లో .. ' హక్కుల కోసం చస్తాం కానీ ఆశలతో మాత్రం చావం' .. 'గుండెలు కనబడకపోతే చెప్పండి .. గుండీలు తీసి నిలబడతాం' .. 'పబ్లిక్ ఉంది .. కమిషన్ ఉంది .. మరి మధ్యలోని సర్వీస్ ఏమైంది .. అనేవి ఆకట్టుకుంటాయి. ఒక సమస్యను తీసుకుని దానిని నిజాయితీగా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించిన సినిమా ఇది. వినోదపరమైన అంశాలను ఆశించేవారిని కాకుండా, మిగతావారిని మాత్రమే మెప్పించే సినిమా ఇది.

Untitled Document
Advertisements