ఉడికించిన పదార్థాలను ఎన్ని రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని తినొచ్చు?

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 02:05 PM

ఉడికించిన పదార్థాలను ఎన్ని రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని తినొచ్చు?

ఆహారం ఏదైనా సరే తాజాగా ఉన్నప్పుడు తినడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. వండిన పదార్థాలు అయితే వేడిగా ఉన్నప్పుడు లేదా ఒక రోజు లోపు తినేయడమే ఆరోగ్యానికి మంచిది. ఈ మాటని మన పెద్దలు తరుచుగా చెప్పడం మనం వింటూనే ఉంటాము. అయితే ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఒకప్పుడు వండుకుని తినడాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం నిష్టగా చేసేవారు. మరి నేడు ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా ఆ సమయాన్ని ఇతర వ్యాపకాలకు వాడుకుంటున్నారు. ఈ కారణంగా ఒకేసారి అధిక మొత్తంలో వండి వండి దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తరబడి తినే అలవాటు ఉన్నవారు ఉన్నారు. అయితే, ఇలా చేయవచ్చా? ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరుగుతుంది.. అసలు రిఫ్రిజిరేటర్ లో వండిన ఆహారం ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది? పాడైపోదా? ఇలా ఎన్నో సందేహాలు వస్తుంటాయి.
నిపుణులు సైతం వండిన ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు ఫ్రిజ్ లో పెట్టేసి వాడుకోవద్దని సలహా ఇస్తుంటారు. ఇదే విషయమై రచయిత, టీసీఎస్ డిజిటల్ వర్క్ ప్లేసెస్ గ్లోబల్ హెడ్ అయిన క్రిష్ అశోక్ కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వండిన ఆహారాన్ని ఎంత సమయం పాటు ఫ్రిజ్ లో ఉంచొచ్చు? అలా ఉంచడం వల్ల చల్లదనానికి పోషకాలు నశించిపోతాయా? వీటికి ఆయన స్పష్టత నిచ్చారు. ఇందుకు సంబంధించి వీడియోను ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘రిఫ్రిజిరేటర్ లో ఆహారం ఉంచడం వల్ల పోషకాలు పోవడం ఉండదు. నిజానికి వండినప్పుడే ఎక్కువ పోషకాలను నష్టపోతుంటాం. నీటిలో కరిగిపోయే విటమిన్లు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటాయి. కనుక వీటిని వండినప్పుడు అధిక వేడి కారణంగా ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది’’ అని వివరించారు.
‘‘గాలి ప్రవేశించని కంటెయినర్ (ఎయిర్ టైట్)లో ఆహారాన్ని ఉంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టేస్తే కనీసం 2-3 రోజుల నుంచి వారం వరకు నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తే, ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఉన్నట్టయితే ఆరు నెలల వరకు ఆహారం పాడవదు. కాకపోతే కొన్నింటికి మినహాయింపు ఉంది. సాధారణంగా ఉడికించిన లేదా స్టీమ్డ్ రైస్ తో చేసిన ఆహారం బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ కావచ్చు. కనుక దీన్ని ఒకటి రెండు రోజుల్లోనే తినేయాలి. భారతీయ ఆహారం రిఫ్రిజిరేటర్ కు అనుకూలంగా ఉంటుంది. స్పైసీగా, ఉప్పుతో ఉండడం వల్ల సూక్ష్మక్రిములు అంత తొందరగా చేరవు’’ అని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements