రాహుల్ యాత్ర ముగింపుకు ఆటంకంగా మారనున్న హిమపాతం !

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 11:54 AM

రాహుల్ యాత్ర ముగింపుకు ఆటంకంగా మారనున్న హిమపాతం !

శీతాకాలం వచ్చిందటే చాలు చలిగాలులు వీస్తూ మంచు కురవడం మనకు తెలిసిన విషయమే. కానీ దేశ సరిహద్దుల్లో మాత్రం తరుచుగా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే, కాశ్మీర్ లో సోమవారం రికార్డు స్థాయిలో మంచు కురిసింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇదే రికార్డని అధికారులు చెబుతున్నారు. హిమపాతం ఎక్కువగా ఉండడంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంచు పేరుకు పోవడంతో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన సభకు ఏర్పాట్లలో ఆటంకాలు ఎదురవడమే ఇందుకు కారణం.
జోడో యాత్ర ముగింపు సభ సజావుగా సాగేదెలాగని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీనగర్ లోని షేర్ ఈ కాశ్మీర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాహుల్ జెండా ఎగరవేసి, అక్కడి నుంచి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. అయితే, మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ర్యాలీ నిర్వహించడం సాధ్యం కాదేమోనని పార్టీ నేతలు సందేహిస్తున్నారు.

మరోవైపు, జోడో యాత్ర ముగింపు సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన 12 పార్టీల నేతలు హాజరుకానున్నారు. అయితే, జాతీయ రహదారి మూసేయడం, రోడ్లపై పేరుకుపోయిన మంచు కారణంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సభకు వచ్చే నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. కొంతమంది ప్రయాణాలు మానుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెప్పారు.





Untitled Document
Advertisements