రూ. 2 వేల నోటుతో బంగారం కొనే వారి వద్ద అధికంగా వసూలు చేస్తున్న వ్యాపారస్తులు

     Written by : smtv Desk | Tue, May 23, 2023, 02:49 PM

రూ. 2 వేల నోటుతో బంగారం కొనే వారి వద్ద అధికంగా వసూలు చేస్తున్న వ్యాపారస్తులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 దాకా గడువు కూడా ఇచ్చింది. ఈ రోజు (మంగళవారం) నుంచి బ్యాంకుల్లో నోట్లను మార్చుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది. అయితే, బ్యాంకుల వద్ద పెద్దగా రద్దీ కనిపించడంలేదు కానీ గోల్డ్ షాపుల్లో రద్దీ పెరిగింది. బ్యాంకుల్లో నోట్లు మార్చుకుంటే ఆదాయపన్ను రికార్డులకు ఎక్కే అవకాశం ఉందని బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఎగబడుతున్నారు. రూ.2 వేల నోట్లతో బంగారం కొనుగోలు చేస్తామని ఫోన్లలో ఎంక్వైరీ చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. రూ.2 లక్షల లోపు బంగారం, వెండి, రత్నాలు తదితర ఆభరణాలను నగదుతో కొనుగోలు చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరంలేదు. అంతకుమించిన నగదు కొనుగోళ్లకు మాత్రం పాన్, ఆధార్ కార్డుల వివరాలు తప్పనిసరి. ఈ రూల్ ను అనుకూలంగా మార్చుకుని తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని బంగారం దుకాణాల యజమానులు కూడా అర్థం చేసుకున్నారు. దీంతో బంగారం రేటు పెంచేశారు. పెద్ద నోటుతో కొంటే 5 నుంచి 10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం రేటు 10 గ్రాములకు రూ.61 వేలకు పైనే కొనసాగుతుండగా.. రూ.2 వేల నోట్లతో బంగారం కొనాలనుకుంటే రూ.67 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం.





Untitled Document
Advertisements