నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్‌కు సీటు కేటాయింపుపై పవన్ స్పష్టత

     Written by : smtv Desk | Mon, Feb 26, 2024, 08:07 AM

నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్‌కు సీటు కేటాయింపుపై   పవన్ స్పష్టత

రాబోయే ఎన్నికలలో టీడీపీ , జనసేన పార్టీలు కలసికట్టుగా ఎన్నికల బరిలో దిగుతున్న విష్యం తెలిసిందే. ఈ మేరకు ఏరు పార్టీలు కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేశ్‌కు సీటు కేటాయింపుపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజమహేంద్రవరానికి సమీపంలోనే ఉన్న నిడదవోలు సీటును ఆయనకు కేటాయించారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ శనివారం రాత్రి దుర్గేశ్‌ను పిలిపించి మాట్లాడారు. రాజమహేంద్ర వరం గ్రామీణం నుంచి టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బరిలోకి దిగుతున్నట్టు దుర్గేశ్‌కు చెప్పారు.

ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. మరోవైపు, రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఈ స్థానాన్ని ఒదులుకోబోమని కూడా పవన్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే, శనివారం టీడీపీ, జనసేనలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాత్రం ఈ స్థానం ప్రస్తావన లేకపోవడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. పవన్ నిర్ణయంతో దీనికి తెరపడింది.

నిడదవోలు నుంచి పోటీపై కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం కార్యకర్తలతో విస్తృత చర్చల అనంతరం అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పా. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైనా ఒత్తిళ్లు ఉంటాయి. దీని వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చంద్రబాబు కూడా నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని అన్నారు. వారు సహకరిస్తారని తనతో చెప్పారు’’ అని దుర్గేశ్ పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడే అర్హత లేదని దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఏ నాయకుణ్ణి ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని విమర్శలు చేశారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉన్నమాట వాస్తవమేనని, వారందర్నీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామని తెలిపారు. పార్టీని వీడే ఆలోచన కానీ, స్వతంత్ర అభ్యర్థిగా చేసే ఆలోచన గానీ తమకు లేవని స్పష్టతనిచ్చారు.





Untitled Document
Advertisements