ఇకపై ఆడ పిల్లలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేయకూడదు.. కాంగ్రెస్ ప్రభుత్వం

     Written by : smtv Desk | Tue, Feb 27, 2024, 12:32 PM

ఇకపై ఆడ పిల్లలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేయకూడదు..  కాంగ్రెస్ ప్రభుత్వం

ఇప్పటి వరకు 18 ఏళ్ళు నిండన ఆడపిల్లకు వివాహం చేస్తే అది చట్టప్రకారం నేరంగా పరిగణించే వారు. కచ్చితంగా 18 ఏళ్ళు నిండితేనే ఆ పెళ్ళి చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేది. అయితే ఇక మీదట ఇది కుదరదు. తాజాగా అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వివాహ వయసును పెంచుతున్నామని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ఇకపై ఆడ పిల్లలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేయకూడదని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను రూపొందించబోతున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లు, అబ్బాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది. అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతున్న తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించబోతోంది. ఈ మార్పుకు సంబంధించిన ప్రతిపాదనకు జనవరిలోనే సుఖు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బిల్లు పాస్ అయితే... వరుడు, వధువు ఇద్దరి కనీస వివాహ వయసు సమానంగా 21 ఏళ్లుగా ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ మేరకు ప్రజలు ఏకీభవిస్తారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements