కేరళలో రోడ్డుకు పెళ్లి.. వధువరులు?

     Written by : smtv Desk | Tue, Feb 27, 2024, 12:54 PM

కేరళలో రోడ్డుకు పెళ్లి.. వధువరులు?

పెళ్ళి అనగానే మనకు తెలిసింది వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి దంపతులుగా కలిసి జీవించేందుకు జరిపించే ఒక వేడుక. అయితే ఈ పెళ్ళి అనేది మనుషులకు మాత్రమె కాక కుక్కలకు, గాడిదలకు ఇలా జంతువులకు పెళ్లిళ్లు జరిపించడం మనకు తెలుసు. కానీ,ఒక చోటు ఎవరు ఇప్పటి వరకు కనీ వినని రకం పెళ్ళి జరిగింది. అవునండి ఇది నిజం. మనుషులకో, జంతువులకో కాకుండా ఓ గ్రామస్థులు మాత్రం ఏకంగా రోడ్డుకు ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్ళి మాత్రమే కాకుండా అతిథులను ఆహ్వానించి పెళ్ళికి వచ్చిన వారికి పసందైన విందును ఏర్పాటుచేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఈ ఘటన కేరళలోని కోజికోడ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా కొడియత్తూరు గ్రామస్థులు రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల కోసం ఈ కార్యక్రమాన్ని జరిపించడం విశేషం. అయితే, ఈ పెళ్లి వధువరులు ఎవరు అని అడగొద్దు. కానీ అక్కడ అలాంటి ఏమీ ఉండవు. కేవలం నిధులు పోగేయడం కోసమే ‘రోడ్డుకు పెళ్లి’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు.
కొడియాత్తూరులో 1980లో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు నిర్మించారు. అప్పటితో పోల్చితే ఈ గ్రామంలో జనాభా మూడు రెట్లు పెరిగింది. దీంతో వాహన రాకపోకలు భారీగా పెరిగి ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల పనులు మొదలుకాలేదు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొందరు భూమిని కోల్పోతారని గుర్తించారు.
వారికి పరిహారం, రహదారి నిర్మాణానికి రూ.60 లక్షలు అవుతుందని అంచనా వేసి, ఈ నిధుల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామానికి చెందిన 15 మంది ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున విరాళం అందజేశారు. మరో, రూ.45 లక్షలు అవసరం కావడం.. అప్పుడే వారికి ‘పనం పయట్టు’ లేదా కురికళ్యాణం గుర్తుకొచ్చింది. ఇది ఉత్తర కేరళలో సంప్రదాయ దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి.. నిధులను సమీకరిస్తుంటారు. 90వ దశకంలో రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రాముఖ్యత కోల్పోయిన సంప్రదాయాన్ని. రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు నిధుల కోసం మారుమూల గ్రామస్థులు తెరపైకి తెచ్చారు. పనం పయట్టు కింద రహదారికి పెళ్లిచేశారు.
ఇక,కురికళ్యాణం కోసం గ్రామస్థులు కమిటీగా ఏర్పడి.. ఏర్పాట్లు చేపట్టారు. పక్క గ్రామాలకు వెళ్లి వారిని ఆహ్వానించారు. అతిథులకు టీలు, కాఫీలు, స్నాక్స్‌తో పాటు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. ఈ పెళ్లికి వచ్చిన అతిథులు ఇచ్చిన కానుకలు రూ.10.4 లక్షల మేర సమకూరాయి. రోడ్డు విస్తరణ కోసం గ్రామంలోని 107 కుటుంబాలు, వాణిజ్య సంస్థలు, దేవాలయాలు, మసీదులు తమ భూమిని ఉచితంగా ఇచ్చారు. గతేడాది డిసెంబరులో ఈ రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్‌కు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన నిర్వహించారు. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూడకుండా తమకు కావాల్సినది తామే సాధించుకుని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామస్తుల కృషి గురించి తెలిసి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.





Untitled Document
Advertisements