రైతన్నను అవమానించిన మెట్రో స్టేషన్‌ సిబ్బంది.. మండిపడుతున్న నేట్టిజన్లు

     Written by : smtv Desk | Tue, Feb 27, 2024, 01:07 PM

రైతన్నను అవమానించిన మెట్రో స్టేషన్‌ సిబ్బంది.. మండిపడుతున్న నేట్టిజన్లు

ఉదయం లేచింది మొదలు రాత్రి పక్కమీదకు చేరే వరకు నిత్యం మట్టిలోనే శ్రమించే రైతులు సాధారణంగా ఎలా ఉంటారు. శరీరం మీద శ్రద్ధ లేకుండా ఇటువంటి అలంకరణ లేక మాసిపోయిన గడ్డం, మట్టి పట్టిన బట్టలతో కనిపిస్తారు. కానీ వారి బాహ్య రూపం ఎలా ఉన్నా రాత్రనక పగలనక నిత్యం శ్రమించి ఈ దేశానికి అన్నం పెడుతూ ఉంటారు. అయితే కష్టజీవిగా పేరు తెచ్చుకున్న అన్నదాతకు చాలా చోట్ల దక్కే గౌరవం మాత్రం చాలా తక్కువే. ప్రస్తుతకాలంలో చాలామంది రైతులను చులకనగా, హీనంగా చూస్తూ ఉంటారు. తాజాగా ఓ మసలి రైతును మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకున్న ఘటన పెను దుమారానికి కారణం అయింది. టికెట్ తీసుకుని రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. ఆ వృద్ధుడిని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. దీంతో అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు మెట్రో సిబ్బందిని నిలదీశాడు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరు మెట్రో లైన్‌లోని రాజాజీ నగర్ మెట్రో స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక రైతు తన మూటతో కలిసి మెట్రో రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ టికెట్ కూడా కొనుగోలు చేశాడు. చివరికి సెక్యూరిటీ దగ్గరకు రాగానే అతడిని వారు నిలిపివేశారు. అతను తీసుకువచ్చిన మూటలో ఏదో నిషేధిత వస్తువు ఉందా అంటే అదీ కాదు. ఆయన వేసుకున్న బట్టల కారణంగా.. మెట్రో రైలు ఎక్కడానికి సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆ వృద్ధుడిని అక్కడే ఆపేశారు. అది గమనించిన మరో ప్రయాణికుడు మెట్రో సిబ్బందిని కడిగిపారేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తీసిన ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్‌గా మారింది. మెట్రో సిబ్బంది తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
వృద్ధుడిని మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకోవడంపై ఆ ప్రయాణికుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బట్టలు బాగా లేవు అనే కారణంతో టికెట్ కొని ప్రయాణించే వ్యక్తిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించాడు. అతడు ఏమైనా తీసుకెళ్లరాని వస్తువులు తీసుకెళ్తున్నాడా అని నిలదీశాడు. మెట్రో రైలు అనేది ఏమైనా వీఐపీల కోసమా అని.. సాధారణ ప్రయాణికులు, ప్రజలు ప్రయాణించకూడదా అంటూ మెట్రో సిబ్బందిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకోవడానికి సరైన కారణం ఏంటని ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు మెట్రో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రైతును అలా అవమానించడం ఏంటని తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోకుండా అక్కడే ఉండి మెట్రో సిబ్బందిని ప్రశ్నించిన ఆ ప్రయాణికుడిని ప్రశంసిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీయడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. రైతును అడ్డుకున్న సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగళూరు మెట్రో ప్రకటించింది. ఏది ఏమైనా ఆరుగాలం కష్టపడి అందరి కడుపులు నింపే రైతన్నకు జరిగిన అవమానం దారుణం.
https://twitter.com/nabilajamal_/status/1762052890963685604?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1762052890963685604%7Ctwgr%5E7f044f16412c15cb52652ed2b62740d46cc779f0%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Flatest-news%2Findia-news%2Fold-man-denied-entry-for-dressing-too-dirty-at-bengaluru-metro-security-supervisor-fired%2Farticleshow%2F108018510.cms





Untitled Document
Advertisements