మహా శివరాత్రి నేపధ్యంలో శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!

     Written by : smtv Desk | Fri, Mar 01, 2024, 09:02 AM

మహా శివరాత్రి నేపధ్యంలో శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!

మహా శివరాత్రి నేపధ్యంలో శైవ క్షేత్రాలు అన్ని భక్తులతో కిటకిటలడతాయి. ఎక్కడెక్కడి నుండి భక్తులు పుణ్యక్షేత్రాలకు ఆ దేవదేవుని దర్శనార్థమై విచ్చేస్తుంటారు. ముఖ్యంగా శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువే ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు ఓ శుభవార్త. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు. అయితే, బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు.





Untitled Document
Advertisements