లోక్‌సభ ఎన్నికల ముంగిట చివరిసారిగా మంత్రివర్గ సమావేశం.. ఎన్నికల తరువాత మళ్లీ కలుద్దామన్న ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 08:27 AM

లోక్‌సభ ఎన్నికల ముంగిట చివరిసారిగా మంత్రివర్గ సమావేశం.. ఎన్నికల తరువాత  మళ్లీ కలుద్దామన్న  ప్రధాని మోదీ

కొద్దిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చివరిసారిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో మోదీ మంత్రులతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్ల సంసిద్ధత, వికసిత్ భారత్ పేరిట వచ్చే ఐదేళ్ల ప్రణాళికపై చర్చించారు. 12 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా మంత్రులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఎన్నికల ప్రసంగాల విషయంలో సంయమనం పాటించాలని, ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ముఖాలు, గొంతులను సైతం అనుకరించే డీప్ ఫేక్ టెక్నాలజీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. బీజేపీ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ 2047తో పాటు వచ్చే ఐదేళ్ల కోసం సిద్ధం చేసిన కార్యాచరణపై కూడా బీజేపీ సీనియర్ నేతలు సమాలోచనలు జరిపారు.
ఇన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలపై ప్రజలతో విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయొద్దని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ప్రజామద్దతు కూడగట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పారు. దేశాభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైలైట్ చేయాలని సూచించారు. ఎన్నికలయ్యాక మళ్లీ కలుద్దామని కూడా మోదీ తన సహచర మంత్రులతో అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మే నెలలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక తొలి 100 రోజుల్లో ఏం చేయాలనేదానిపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, హర్దీప్ పురి, కిరణ్‌ రిజిజు, అర్జున్ మేఘ్వాల్, పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సూచనలను స్వాగతించారు. పలు ప్రభుత్వ శాఖలు కూడా ఈ సమావేశంలో తమ ప్రతిపాదనలు పంచుకున్నాయి. మోదీ సూచనల మేరకు మంత్రులు రాబోయే ఎన్నికలకు సిద్దం అవుతున్నట్టుగా తెలుస్తుంది.





Untitled Document
Advertisements