అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక.. ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 08:27 AM

అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక.. ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు

ఒకవైపు మండిపోతున్న ఎండలు, వేడి గాడ్పుల సెగలు వెరసి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు (బుధవారం) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇక ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. వేసవిలో కురుస్తున్న వర్షాల చల్లదనంతో ఎండల వేడిమి నుండి ఉపశమనం లభించినట్టుగా అయ్యింది.





Untitled Document
Advertisements