అగ్రరాజ్యంలో భారతీయులపై ఆగని దాడులు.. వాషింగ్టన్ వీధిలో మరొకరి మృతి

     Written by : smtv Desk | Sat, Feb 10, 2024, 09:19 AM

అగ్రరాజ్యంలో భారతీయులపై ఆగని దాడులు.. వాషింగ్టన్ వీధిలో మరొకరి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల వరస మరణాలు అందరికి కలచివేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి వివిధ కారణాలతో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, తాజాగా మరొకరి మృతి దిగ్భ్రాంతికి గురించేస్తుంది. వాషింగ్టన్ రెస్టారెంట్‌ బయట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాగా గుర్తించారు. ఈ నెల 2న జరిగిందీ ఘటన. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై పేవ్‌మెంట్‌కేసి తలను బాదాడు. తీవ్రంగా గాయపడిన వివేక్ మరణించాడు.

41 ఏళ్ల తనేజా అర్ధరాత్రి 2 గంటలు దాటాక రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడి వున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తనేజా గురువారం ప్రాణాలు విడిచాడు.

ఘటనా స్థలంలోని సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం మొదట్లో షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), నీల్ ఆచార్య, వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ మృతి చెందారు.





Untitled Document
Advertisements