కాళీయమర్దనం!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 01:21 PM

కాళీయమర్దనం!

ఒకనాడు శ్రీకృష్ణుడు తన మిత్రబృందాన్ని  వెంటబెట్టుకొని గోవులు కాయుటకు అడవికి వెళ్ళాడు. గోపబాలురు అడవిలో బాగా తిరిగి అలసిపోయారు. ఆవులకు, గోపబాలురకు దాహం వేయగా గోపబాలురు ఆవులమందలను తోలుకుని అక్కడ ప్రవహిస్తున్న యమునా సమీపంలో ఉన్న కాళింది మడుగున నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకున్నారు. గోపబాలకులు నీళ్లు తాగిన మడుగులో కాళీయుడనే ఫణిరాజు నివాసం ఉన్నాడు. ఆ పాము రేడు విషం వల్లనే కాళింది మడుగులోని నీరు విషపూరితం అయిపోవడం వల్ల నీరు తాగిన గోవులు, గోపాలురు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కృష్ణుడు తన యోగ ప్రభావంతో పశువుల్ని, గోపకులనీ బ్రతికించాడు. కృష్ణుని కృప వల్ల అందరికీ ప్రాణభిక్ష కలిగిందని సంతోషించారు. మడుగులోని నీటిని విషపూరితం చేసిన సర్పరాజు కు బుద్ధి చెప్పాలని శ్రీకృష్ణుడు మడుగులో దూకాడు. మడుగులో నీళ్లు అల్లకల్లోలం అయ్యాయి. దాంతో కాళీయుడికి కోపం వచ్చి తల ఎత్తి ఒకసారి కృష్ణుని తీక్షణంగా చూశాడు. వేగంగా వచ్చి చిన్ని కృష్ణుని మీద తన కోరల్లోని విషయాన్ని విరజిమ్మాడు. కృష్ణుడు మాత్రం ఏమీ చలించలేదు. చివరకు కృష్ణుని చుట్టుకొని కాటు వేయడానికి ప్రయత్నించాడు కాళీయుడు. కృష్ణుడు నేర్పుగా కాళీయుని తోకను పట్టుకొని వేగంగా, బలంగా మెలికలు తిప్పడం మొదలుపెట్టాడు. దాంతో కాళీయుడు బాగా అలసిపోయాడు. బాలకృష్ణుడు ఆ ఫణిరాజు తోకను పట్టుకొని తల పైకి ఎక్కి బలంగా తొక్కడం మొదలుపెట్టాడు. కృష్ణుని పాద ఘట్టానికి కాళీయుడు నోటి వెంట రక్తం ధారలుగా కారసాగింది. చివరకు ప్రాణాలు పోయే స్థితి ఏర్పడింది. ఆ మడుగు లోనే ఉన్న కాళీయుని భార్యలకు ఈ విషయం తెలిసి పరుగున వచ్చి పతిభిక్ష పెట్టమని కృష్ణుని దీనంగా ప్రార్థించారు. చివరకు కాళీయుడు కూడా కృష్ణుని కరుణించమని ప్రార్ధించాడు. " శ్రీకృష్ణా!  గరుత్మంతుని కి భయపడి నేను, నా భార్యలతో ఇక్కడ దాగి జీవిస్తున్నాం. ఈ పరిసరాలకు ఎవరూ రాకుండా ఉండాలనే ఈ మడుగును విషపూరితం చేశాను. నన్ను క్షమించు" అని ప్రాణభయంతో ప్రార్ధించాడు.
కృష్ణుడు కరుణించి, " ప్రాణికోటికి జీవనాధారం అయిన జలాన్ని విషపూరితం చేశావు. ఈ మడుగులో ఉన్న విషాన్ని పిలిచి నీటిని పరిశుభ్రం చేసి ఇక్కడి నుంచి తొలగిపో! గరుత్మంతుని వల్ల భయం లేకుండా నీ తల మీద నా పాదముద్రలు ఉండి నిన్ను కాపాడుతాయి" అని వరమిచ్చాడు బాలకృష్ణుడు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి నీటిని శుభ్రం చేసి తన భార్యలతో కూడి రత్నాకర ద్వీపానికి వలస పోయాడు కాళీయుడు.





Untitled Document
Advertisements