నేడు థియేటర్లలో సందడి చేస్తున్న 'వీరసింహా రెడ్డి' మూవీ రివ్యూ

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 11:47 AM

నేడు థియేటర్లలో సందడి చేస్తున్న  'వీరసింహా రెడ్డి' మూవీ రివ్యూ

నందమూరి నటసింహ బాలకృష్ణ అంటేనే ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అభిమానులంత బాలయ్య అంటూ ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వరుస సినిమాలు చేశారు. ఆయన చేసిన సినిమాలు చాలావరకూ హ్యట్రిక్ హిట్ ని సొంతం చేసుకున్నాయి. ఆ తరహా కథలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో 'వీరసింహారెడ్డి' సినిమా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నేడు థియేటర్లకు వచ్చింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, హిట్ జాబితాలో చేరుతుందా లేదా.. అసలు సినిమా లైన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
'పులిచర్ల'లో వీరసింహారెడ్డి (బాలకృష్ణ)ని అక్కడి ప్రజలు దేవుడిలా భావిస్తుంటారు. అక్కడ ఆయన చెప్పిందే వేదం .. ఆయన ఆదేశమే శాసనం. అయితే వీరసింహారెడ్డి ఆధిపత్యాన్ని ప్రతాప రెడ్డి (దునియా విజయ్) సహించలేకపోతుంటాడు. అదను దొరికితే వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తండ్రి చావుకి వీరసింహారెడ్డి కారకుడు కావడమే ప్రతాపరెడ్డి పగకు కారణం.

అయితే ఎప్పటికప్పుడు వీరసింహారెడ్డి చేతిలో తన్నులు తిని ప్రతాప్ రెడ్డి తోకముడుస్తూ ఉంటాడు. ఆయన భార్య ఎవరో కాదు .. వీరసింహా రెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్). తన అన్నను చంపేసి రమ్మని ఆమె తన భర్తను రెచ్చగొట్టి మరీ అతనిపైకి పంపిస్తూ ఉంటుంది. అతని 'తల' తెచ్చిన రోజునే తనకి మనఃశాంతి అని చెబుతూ ఉంటుంది. దాంతో అతను మరింత మందిని కూడగట్టుకుని వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ట్రై చేస్తుంటాడు.

ఇక 'ఇస్తాంబుల్' లో మీనాక్షి(హానీ రోజ్) ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. ఆమె కొడుకే జైసింహా రెడ్డి( బాలయ్య). బిజినెస్ విషయంలో తల్లికి సహకరిస్తూ .. ఈషా (శ్రుతి హాసన్)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ విషయాన్ని తన తండ్రి జయరామ్ (మురళి శర్మ)తో ఈషా చెబుతుంది. సంబంధం మాట్లాడుకోవడానికి ఆ తల్లీ కొడుకులు ఈషా ఇంటికి వెళ్లవలసిన సందర్భంలో, జై సింహారెడ్డితో అతని తండ్రి వీరసింహారెడ్డి అని మీనాక్షి చెబుతుంది. జై సింహారెడ్డి నిశ్చితార్థానికి అతని తండ్రిని ఇస్తాంబుల్ కి పిలిపిస్తానని అంటుంది.

వీరసింహారెడ్డి పులిచర్లలో ఉంటే మీనాక్షి ఎందుకు 'ఇస్తాంబుల్' లో ఉంటోంది. తన కొడుక్కి పెళ్లీడు వచ్చేవరకూ తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? వీరసింహారెడ్డి చెల్లెలు అతని శత్రువైన ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్నయ్యపై ఆమె పగతో రగిలిపోయేంతగా ఏం జరిగింది? తన కొడుకు నిశ్చితార్థానికి ఇస్తాంబుల్ వెళ్లిన వీరసింహారెడ్డికి అక్కడ ఎలాటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేవి కథలో కనిపించే ఆసక్తికరమైన అంశాలు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం, మాస్ యాక్షన్ స్టొరీపై ఆయనకి ఉన్న పట్టుకు నిదర్శనంగా కనిపిస్తుంది. కథ మొదటి నుంచి చివరి వరకూ కూడా తరువాత ఏం జరగనుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళ్లాడు. ఇంటర్వెల్ సమయానికే సినిమా మొత్తం చూసేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఆ తరువాత చూపించడానికి ఏముంటుంది? అనే సందేహాం ఆడియన్స్ లో తలెత్తుతుంది.

కానీ వీరసింహా రెడ్డితో ముడిపడిన వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ .. దునియా విజయ్ ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ ను రక్తి కట్టిస్తాయి. ఎక్కడా టెంపో తగ్గకుండా కథ అంచలంచెలుగా పైమెట్టుకు చేరుకుంటూ ఉంటుంది. కథ .. కథనం .. ట్విస్టులతో ప్రేక్షకులు జారిపోకుండా డైరెక్టర్ చూసుకున్నాడు. బాలకృష్ణ .. హనీరోజ్ .. దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను అతను మలిచిన విధానం బాగుంది. ఇక శ్రుతిహాసన్ .. మురళీశర్మ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. హనీరోజ్ పాత్రను రిజిస్టర్ చేసే విషయంలో కూడా మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.

బలమైన కథాకథనాలతో ముందుకు వెళుతున్న ఈ సినిమాకి తమన్ బాణీలు మరింత ఊతాన్ని ఇచ్చాయని చెప్పచ్చు. ప్రతి పాటా మాస్ ఆడియన్స్ ను ఊపేస్తుంది. ఒక రకంగా ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడనే అనాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. రిషి పంజాబి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. ఫైట్స్ లోను .. పాటల చిత్రీకరణలోను ఆయన పనితనం మరింత కనిపిస్తుంది.

ఈ కథలో మంచి స్క్రీన్ ప్లే ఉంది .. దానిని తేలికగా అర్థం చేసుకునే విధంగా నవీన్ నూలి ఎడిటింగ్ ఉంది. రామ్ లక్ష్మణ్ .. వెంకట్ ఫైట్స్ కొత్తగా అనిపిస్తాయి. షర్టు జేబుల్లో నుంచి చేతులు బయటికి తీయకుండా చేసే జూనియర్ బాలయ్య ఫైట్ ను .. కుర్చీలో నుంచి లేవకుండా సీనియర్ బాలయ్య చేసే ఫైట్ ను బాగా కంపోజ్ చేశారు. కొరియోగ్రఫీ కూడా మంచి మార్కులు కొట్టేసింది. సిగరెట్ తాగుతూ .. గోలీ సోడా తాగుతూ బాలయ్యతో వేయించిన స్టెప్పులకు విజిల్స్ పడతాయి.
ఇక సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టిస్తాయి. 'నన్ను బతికిస్తున్నది నా ప్రాణం కాదు .. పగ' .. 'సీతకి దూరమైనా రాముడు దేవుడే' .. 'కోసేవాడికి కోడి మీద కోపం ఉండదురా .. నేనూ అంతే' .. 'ఇది ముడిపడే చోటు .. తలపడే చోటు కాదు' .. 'నువ్వు సవాలు విసిరితే నేను శవాలు విసురుతా' .. 'ఇన్నాళ్లకి ఈ మట్టికీ .. మందికి దూరంగా దొరికినాడ్రా' .. 'మగతనం గురించి నువ్వు మాట్లాడితే మొలతాళ్లు సిగ్గుపడతాయ్' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. బాలకృష్ణ .. దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్. సంక్రాంతి బరిలోకి దిగిన బాలయ్యకి ఆయన సెంటిమెంటును నిజం చేస్తూ ఈ సినిమా హిట్ ఇస్తుందనే చెప్పాలి.





Untitled Document
Advertisements