వరల్డ్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత అమ్మాయిలు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 11:37 AM

వరల్డ్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత అమ్మాయిలు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

గత కొన్నేళ్లుగా అమ్మాయిలు క్రికెట్ ఆటలో రాణిస్తున్నప్పటికి వారిని వరుస ఓటములు పలకరించిన కారణంగా వారికి, వారి ఆటకు సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పుకోవాలి. ఎట్టకేలకు విజయలక్ష్మి వారిని వరించింది. ప్రపంచ కప్ వారి వశం అయ్యింది. విజయలక్ష్మితో పాటు ధనలక్ష్మి సైతం వారి సొంతంచేసుకునే అవకాశం దక్కింది ఈ గెలుపుతో..దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి పురస్కారంగా యంగ్‌ ఇండియాకు రూ. 5 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇది మనమంతా గర్వించదగ్గ తరుణం. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్‌కు ఇది మరింత తోడ్పాటునందిస్తుంది. ఈ విజయంలో భాగస్వాములైన ప్లేయర్లు, జట్టు కోచింగ్ సిబ్బందికి రూ. 5 కోట్లు ఇవ్వనున్నాం’ అని షా పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ప్రపంచ విజేతగా నిలిచింది.

మహిళల క్రికెట్ లో ఏ స్థాయిలో అయినా భారత్ కు ఇదే తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. వరల్డ్‌ కప్‌ చేజిక్కించుకొని తిరిగి వస్తున్న షెఫాలీ వర్మ బృందాన్ని బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ కు జై షా ఆహ్వానించారు. మ్యాచ్ సందర్భంగా యువ క్రికెటర్లను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కాగా, ప్రపంచ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించాల్సి ఉంది.

Untitled Document
Advertisements